తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ప్రచార వ్యూహంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. ఆయన గజ్వేల్ కార్యకర్తల సమావేశాన్ని ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. అక్కడేమంటారు.. ప్రామిస్.. నేను ఈ సారి ఇంకా నియోజకవర్గానికి సమయం కేటాయిస్తా అంటారు. కేసీఆర్ నోటి నుంచి ఆ బతిమాలే మాటలు చూసి… గజ్వేల్ ప్రజలు కూడా.. ఏదో తేడాగా ఉందే అనుకున్నారు. ఆ తర్వాతా నిన్న ప్రచారసభలు ప్రారంభించిన కేసీఆర్… ఖమ్మం జిల్లా వాసుల్ని.. పాలకుర్తి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత రెండు సభల్లోనూ.. తన పాలనా విజయాలను ప్రముఖంగా ఏమీ ప్రస్తావించలేదు నాలుగేళ్లలో అన్నీ అయిపోతాయా.. అని విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తేలిగ్గా తీసుకుంటున్నారు.. ఆరు నెలల్లో అన్నీ చేసేస్తామని.. గడుసుగా హామీ ఇచ్చేస్తున్నారు.
అదే సమయంలో దీనికేమీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ మహాకూటమి గెలిస్తే మాత్రం… లేనిపోని కష్టాలొస్తాయ్న విషయాన్ని మాత్రం ప్రజల ముందు ఉంచడానికి అన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారు. ఓ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని లేఖలను వేదిక మీద నుంచి చూపిస్తున్నారు. ఆ లేఖల్లో ఏముందన్న సంగతి ఎదురుగా కూర్చున్న ప్రజలకు తెలియదు. టీఆర్ఎస్ నేతలు చెప్పరు కూడా. ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోండి.. అని దిగువ రాష్ట్రాలు ఫిర్యాదులు చేయడం కామన్. అలాంటి పత్రం ఏదో అయి ఉంటుంది. ఏపీ అన్నింటి కన్నా దిగువ రాష్ట్రం… పై ప్రాజెక్టులు నిండి.. కిందకు వచ్చే నీరే ఆధారం. నీళ్లు గుంజుకుపోవడానికి అవకాశమే ఉండదు. అయిప్పటికీ.. మహాకూటమి గెలిస్తే.. నీళ్లు చంద్రబాబు తీసుకెళ్తారన్న ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.
ఇదే కాదు… జిల్లాల వారీగా.. కేసీఆర్.. వివిధ రకాల అంశాలను తెరపైకి తీసుకురాబోతున్నారు. ప్రతీ ప్రచారసభలోనూ కేసీర్ ఒకే వ్యూహం అమలు చేస్తున్నారు. ఖమ్మంలో చంద్రబాబు నీళ్లు గుంజుకుపోతారని చెప్పారు. పరకాలలో.. కాంగ్రెస్ వాళ్లు వస్తే కరెంటు ఉండదని.. జాగ్రత్త చెబుతున్నానన్నారు. ఓ రకంగా… కేసీఆర్.. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఓటర్లు ఈ బెదిరింపులకు లొంగుతారా..?