గతమెంతో ఘనం..భవిష్యత్తు అగమ్యగోచరం..ఈ సూత్రం ఏరంగంలో ఉన్నవారికైనా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్రసీమలో ఉన్నవారికి ఈ ఫిలాసఫీని మరింతగా ఆపాదించవొచ్చు. తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు అగ్రదర్శకులుగా హవా చూపించిన వి.వి.వినాయక్, శ్రీనువైట్లలు దాదాపు అదే విధమైన సంకట స్థితిలో ఉన్నారు. ఈ ఇద్దరు మిత్రులకు అనేక విషయాల్లో సారూప్యాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో వీరిద్దరిది చక్కటి స్నేహబంధం. బావా అంటూ ఒకరినొకరు అప్యాయంగా సంబోధించుకుంటారు. ఒకప్పుడు ఇద్దరూ బాక్సాఫీస్‌ను షేక్ చేసి వరుస బ్లాక్‌బస్టర్స్‌ను అందించినవారే. సినిమా శైలిలో కూడా దాదాపు ఇద్దరిదీ ఒకే పంథా. యాక్షన్, వినోదం, పవర్ఫుల్ హీరోయిజం..ఇవే వీరి సినిమాకు ఆయువుపట్టు. టాలీవుడ్లో ఘనమైన సక్సెస్ రికార్డు వున్న ఈ అగ్రశ్రేణి దర్శకులిద్దరూ ప్రస్తుతం సినిమా అవకాశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనడం అతిశయోక్తికాదు.
వినాయక్ దర్శకత్వం వహించిన ఖైదీ నంబర్ 150 భారీ విజయం సొంతం చేసుకున్నప్పటికీ అది రీమేక్ సినిమా అవడం వల్ల ఆ సక్సెస్ క్రెడిట్ అంతా చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది. వినాయక్ తర్వాతి చిత్రం ఇంటిలిజెంట్ దారుణమైన పరాభవాన్ని చవిచూసింది. ప్రస్తుతం వినాయక్…బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తిరిగి తనకు పూర్వవైభవం తీసుకొస్తుందనే ధీమాలో ఉన్నారు వినాయక్. ఇక శ్రీనువైట్ల విషయానికి వస్తే…ఆగడు చిత్రంతో ఆయన విజయపరంపరకు బ్రేకులు పడ్డాయి. తాజాగా విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్‌ను సాధించాడు. ఇప్పుడు శ్రీనువైట్ల సినిమాల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి..రెమ్యునరేషన్ లెక్కలు తర్వాత చూసుకుందాం..సినిమా చేసిన పెడతాను రండీ..అంటూ శ్రీనువైట్ల నిర్మాతలకు ఆపర్లు ఇస్తున్నాడని పరిశ్రమ అంతరంగికుల టాక్. శ్రీను వైట్లతో పోల్చితే వినాయక్ పొజిషన్ కొంచెం బెటరంటున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిని ఇద్దరు టాప్‌గన్స్ పరిస్థితి ఇలా ఎందుకు తయారయిందని ఇటు పరిశ్రమలో అటు అభిమానుల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. ట్రెండ్‌కు తగినట్లుగా అప్డేట్ కాకపోవడం..కథాంశాల విషయంలో రిపీటెడ్ ఫార్ములాను నమ్ముకోవడం..స్లాప్స్టిక్ కామెడీ స్టైల్నుంచి బయటకు రాలేకపోవడం ఈ ఇద్దరి పరాజయాలకు కారణాలుగా చెబుతున్నారు. తమశైలి ఫార్మలా కథలకు స్వస్తిపలికి నేటి ట్రెండ్‌కు తగినట్లుగా ఇన్నోవేటివ్ కమర్షియల్ కాన్సెప్ట్వైపు దృష్టిపెడితేనే ఈ మాస్ దర్శక వీరులిద్దరూ తిరిగి పరిశ్రమలో సత్తాచాటగలరని అభిమానుల మాట.