‘ప్రపంచం బాధ అంతా నా బాధ’ అంటుందిట శ్రీశ్రీ కవిత్వం. అలాగే ‘నాబాధ ప్రపంచానికే బాధ’ అంటుందిట ఆత్రేయ కవిత్వం. ఈ ఇద్దరు పెద్దవాళ్ల గురించి సాహిత్య ప్రపంచంలో ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో చూడబోతే.. ఆత్రేయ తరహాలో.. మా ఏడుపు యావత్తు తెలంగాణకే ఏడుపు.. మాకు జరిగిన మోసం, యావత్తు తెలంగాణకే జరిగిన మోసం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ విలపిస్తోంది. తాము మోసపోయాం గనుక.. తెలంగాణ ప్రజలందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిని, కేసీఆర్‌ను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌లో నామినేషన్ల పర్వం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండులు అందరూ అక్కడి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెరాస చేతిలో తెలంగాణ ప్రజలో మోసపోయారంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. మోసపోవడం అంటే.. ఆయన ఉద్దేశ్యం ఏమిటో అంతగా స్పష్టం కాలేదు.
ఏది ఏమైనప్పటికీ.. కేసీఆర్ చేతిలో, తెరాస చేతిలో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా దారుణంగా మోసపోయిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం నడిపిన, పోరాడిన, ప్రజల్లో క్రేజ్ కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్.. తమ కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తారనే హామీని నమ్మి, అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. కార్యం నెరవేరిన తర్వాత కేసీఆర్ ఎంచక్కా తూచ్ అన్నారు. తేలుకుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఎదురైంది. అప్పటికీ కొందరు నాయకులు.. తెరాసను విలీనం చేసేస్తా అని నమ్మించి మోసం చేశారంటూ ఆక్రోశించారు కూడా! ఏది ఏమైనప్పటికీ.. తెరాస చేతిలో కాంగ్రెస్ పార్టీ మోసానికి గురైన మాట వాస్తవం. అయితే యావత్తు తెలంగాణ రాష్ట్రం మోసపోయిందంటూ జానారెడ్డి భాష్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి స్థానంలో జరుగుతున్న ఈ నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనైనా గెలిచి పరువు దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు నానాపాట్లు పడుతున్నట్లు కనిపిస్తోంది.