జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం చెన్నైలో పర్యటించబోతున్నారు. అక్కడ మీడియా సమావేశం ఉంటుందని… రాజకీయాలపై అక్కడి మీడియాతో తన అభిప్రాయాలు పంచుకుంటారని.. జన సేన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో పోరాటయాత్రను హఠాత్తుగా నిలిపివేసి… చెన్నైలో ప్రెస్ మీట్ ను పవన్ కల్యాణ్ ఎందుకు పెడుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఎన్నికలకు సన్నద్ధత కాలేదని.. తెలంగాణ బరి నుంచి వైదొలిగిన పవన్.. ఏపీలో ఎన్నికల కోసం… సన్నద్ధత కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉనికి చాటిచెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. తమిళమీడియాకు జనసేన తరపున ఆహ్వానపత్రంలో… పవన్ కల్యాణ్ ను సూపర్ స్టార్ గా అభివర్ణించి.. ఆహ్వానాలు పంపారు.
పవన్ కల్యాణ్ చెన్నై టూర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అక్కడ బీఎస్పీ నేతలతో సమావేశమయ్యారు. ఎవరితో సమావేశమయ్యారు.. ఏం చర్చించారన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా… చెన్నై వెళ్లారు. చెన్నైలో ప్రెస్ మీట్ ఎర్పాటు చేస్తున్నారు. ఇది హఠాత్తుగా ఖరారైన షెడ్యూల్ అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 48 గంటల ముందే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అదే సమయంలో… చంద్రబాబు కోల్ కతాలో మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. టీడీపీ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా.. ఆ సమయంలో పవన్ కల్యాణ్.. ఇలా ఏదో ఓ హడావుడి చేస్తూంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే పవన్ కల్యాణ్ సన్నిహితులు మాత్రం.. ఇది చాలా ముందుగానే ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అంటున్నారు. చెన్నైలో.. జనసేన సానుభూతి పరులతో సమావేశమై.. పార్టీ కోసం నిధుల సేకరణ చేస్తారని చెబుతున్నారు. చెన్నైలో… తెలుగువాళ్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి.. వారి ద్వారా జనసేనకు ఆర్థిక సాయం అందేలా చూసుకోవడంతో పాటు.. అక్కడ కూడా పార్టీ ఉనికిని చాటేలా ప్రయత్నాలు చేస్తారంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా.. ఏదో సీక్రెట్ గాసిప్ బయటకు వస్తూనే ఉంటుంది. మరి చెన్నైలో ఏం జరుగుతుందో చూడాలి…!