భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఐదు శాసనసభ స్థానాలున్న ఈ జిల్లాలో కొత్తగూడెం ఒక్కటే జనరల్ స్థానం. మిగతా నాలుగు.. ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు. 2014 ఎన్నికల్లో టీఆరెస్ కొత్తగూడెం లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ ఇల్లందులో, సీపీయం భద్రాచలంలో గెలవగా, వైసీపీ అశ్వరావుపేట, పినపాక స్థానాల్లో గెలిచింది. ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మేల్యే కోరం కనకయ్య, పినపాక అశ్వరావుపేట వైకాపా ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు,, తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్లో చేరిపోయారు. వీరంతా మళ్లీ సిట్టింగుల కోటాలో సీట్లు తెచ్చుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్రావ్ బరిలో ఉన్నారు. ప్రజాకూటమి నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్ రావు పోటీ పడుతున్నారు. పోటీ వీరిద్దరి మధ్యే ఉండనుంది. వనమాకు.. కూటమి బాగా కలసి వచ్చే అంశం. కొత్తగూడెం లో టీడీపీ,సీపీఐ పార్టీల కు గట్టి ఓట్ బ్యాంక్ ఉంది. ఓట్ల బదిలీ కరెక్టుగా జరిగితే వనమా గెలుపు నల్లేరు పై నడకే. కూటమిలో ఓట్ల బదిలీ సక్రమంగా జరగకపోతే గట్టెక్కవచ్చని జలం ఆశలు పెట్టుకున్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి ఈ సారీ జలగంకు ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పినపాక నుంచి గెలియిన పాయం వెంకటేశ్వర్లు ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మేల్యే రేగా కాంతారావు కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మేల్యేగా ఉన్న పాయం పై తీవ్ర వ్యతిరేకత ఉన్న వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేత తుళ్లూరి బ్రహ్మయ్య, సీపీఐ నేత అయోధ్యలకు నియోజకవర్గంలో పట్టు ఉంది. వీరు సహకరిస్తే… రేగా కాంతారావు గెలుపు సులువే కానుంది.
ఇల్లందు అంటే న్యూడెమోక్రసీ…..న్యూడెమెక్రసీ అంటే ఇల్లందు అనే విధంగా దశాబ్దాలుగా రాజకీయం నడిచింది. కానీ గత ఎన్నికల్లో న్యూ డెమోక్రసీలో చీలిక వచ్చింది. దాంతో.. ఓట్లు చీలి కాంగ్రెస్ కు చెందిన కోరం కనకయ్య గెలిచారు. కానీ ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజాకూటమి నుంచి హరిప్రియా నాయక్, న్యూడెమోక్రసీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పోటీ చేస్తున్నారు. అంటే త్రిముఖ పోటీ ఉన్నట్లే. ఐదుసార్లు ఎమ్మేల్యేగా విజయం సాధించిన గుమ్మడి నర్సయ్య ను మళ్లీ గెలిపించి,తమ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలని న్యూడెమోక్రసీ విశ్వప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిగా ఓటమి పాలై ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రజాకూటమి నుంచి బరిలో ఉన్న హరిప్రియా నాయక్ గెలుపు మీద నమ్మకం పెట్టుకున్నారు. కోరంపై అవినీతి ఆరోపణలు టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారాయి.
అశ్వరావుపేట గేట్ వే ఆప్ తెలంగాణ. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వర్ రావు ప్రజా కూటమి నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో తాటి కేవలం 930 ఓట్ల ఆధిక్యంతో… టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర్ రావుపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ వారిద్దరే ప్రత్యర్థులు. తాటి పై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. మెచ్చా నాగేశ్వరరావుపై సానుభూతి ఉంది. కాంగ్రెస్, సీపీఐ పొత్తు కలసి రావడంతో టీడీపీ అభ్యర్థికి ఎడ్జ్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణలో సీపీఎం గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. ఈ సారి త్రిముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్, ప్రజాకూటమి, సీపీఎం విజయం కోసం పోరాడుతున్నాయి. అయితే.. ఇక్కడ టీఆర్ఎస్ సీపీఎంకు సహకరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కానీ భద్రాద్రికి కేసీఆర్ రూపాయి విడుదల చేయకపోవడం… టీడీపీ, సీపీఐ ఓటు బ్యాంక్ పదిలంగా ఉండటంతో.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య…స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు.