కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… హైకమాండ్ వద్ద తన పనితనంతోనే పలుకుబడి పెంచుకుంటున్నారు. ఢిల్లీలో తన గురించి చెప్పేవారు ఎవరూ లేకపోయినా.. మరో వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేస్తున్నా… రేవంత్ రెడ్డికి మాత్రం.. ఢిల్లీలో రావాల్సిన పేరు వస్తోంది. రెండు రోజుల కిందట.. ఆయన నామినేషన్ కార్యక్రమం… తెలంగాణలోనే హాట్ టాపిక్ అయింది. ఓ భారీ బహిరంగసభకు వచ్చిటనట్లు.. కొడంగల్ ప్రజలు తరలి రావడం హాట్ టాపిక్ అయింది. దీనిపై ప్రధాన మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వకపోయినా.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సభల నిర్వహణలో.. రేవంత్ పనితనం మెచ్చిన రాహుల్ గాంధీ ఇరవై మూడో తేదీన మేడ్చల్ సభ బాధ్యతలను కూడా.. రేవంత్‌కే అప్పగించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తనకు ఓ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటికే.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సూచనలు లేకపోయినా.. తన బలాన్ని రాహుల్ ముందు ప్రదర్శించాలని ఆయన అనుకున్నారు. రాహుల్ అనుమతి ఇచ్చిన.. తెలంగాణ నేతల దగ్గరే ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఆ తర్వాత రాహుల్ రెండు సార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఓ సారి… రెండు రోజులు… మరో సారి.. ఇటీవల ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వరుసగా మూడు సభల్లో పాల్గొన్నారు. ఆయా సభల్లో.. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు.. ప్రజల్లో వచ్చిన స్పందనను.. రాహుల్ గాంధీ చూశారు. సహజంగానే.. తనకు వచ్చే.. ఇండిపెండెంట్ సంస్థల నివేదికలతో.. ఆయన ఎవరి సామర్థ్యం ఏమిటో అంచనా వేసుకుంటున్నారు.
ఇప్పుడు సోనియా గాంధీ సభ నిర్వహణ బాధ్యతలు చూసే అవకాశం రావడంతో.. రేవంత్ రెడ్డి.. తన పూర్తి ఎఫర్ట్ పెడుతున్నారు. అధినేత్రి, అధినాయకుడు ముందు తన సామర్థ్యాన్ని నిరూపించుకుని శభాష్ అనిపించుకుంటే.. ముందు ముందు ఇది ఓ పెద్ద సర్టిఫికెట్లా పడి ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎలాంటి కీలక పదవుల విషయంలో అయితే ఇదే ఓ అర్హతగా మారుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి.. చాలా క్లారిటీగానే ఉన్నారు. సోనియాసభ నిర్వహణ విషయంలో ఆయన చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సత్తా చూపించాలనే పట్టుదలతో ఉన్నారు.