ప్రజాసంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నందున తానిక సినిమాల్లో నటించలేనని ప్రకటించారు పవన్‌కల్యాణ్. గతకొంతకాలంగా ఆయన జనసేన కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుస్తున్నారు. తానిక సినిమాల్లో నటించలేనని పవన్‌కల్యాణ్ చెప్పడం అభిమానులకు శరాఘాతంలా తాకింది. విశ్వసనీయ సమచారం ప్రకారం పవన్‌కల్యాణ్ పత్రికా ప్రకటన వెనక ఆయన ఇగో హర్ట్ కావడమే కారణమని చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలలోగా డాలీ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేశారు పవన్‌కల్యాణ్. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ కీలకమైన అతిథి పాత్రలో నటించడానిక ఒప్పుకున్నారు. రామ్ తాళ్లూరు నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన పూర్వ సన్నాహాలన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇక ప్రకటన వెలువడటమే తరువాయి అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, తానే స్వయంగా సినిమా గురించి మీడియాకు వెల్లడించాలని పవన్‌కల్యాణ్ భావించారట. నిర్మాతలు, చిత్ర యూనిట్‌తో సమన్వయలోపం కారణంగా మెల్లగా ఈ సినిమా వార్తలీక్ అయింది. వరుణ్‌తేజ్‌తో కలిసి పవన్‌కల్యాణ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు మీడియా వర్గాలతో పాటు అభిమానులకు తెలిసిపోయింది. తన అనుమతి లేకుండా సమాచారం బయటకు పొక్కడంతో పవన్‌కల్యాణ్ ఒకింత అసహనానికి గురయ్యాడట. సరై సమయంలో తానే సినిమా గురించి అందరికి సమాచారాన్ని అందించేవాడినని, ఇలా తొందరపాటుతో తన మాటను పక్కనపెట్టారని పవన్‌కల్యాణ్ ఫీలయ్యాడట. ఆయన ఇగో హర్ట్ అయిన కారణంగానే ఇక తాను సినిమాలు చేయబోవట్లేదనే ప్రకటన ఇచ్చారని అంటున్నారు.