తెలంగాణ టీడీపీ ప్రత్యేకమైన మేనిఫెస్టో విడుదల చేసింది. పదమూడు స్థానాల్లోనే పోటీ చేస్తున్నప్పటికీ. తన వంతుగా హామీలను ప్రకటించింది. ముఖ్యమంత్రి నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ను ప్రజాఆస్పత్రిగా మారుస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చాలా రోజులుగా ఇదే చెబుతున్నారు. ప్రగతి భవన్ .. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా నిర్మించారు. దాదాపుగా రూ. 300 కోట్లు ఖర్చు అయిందని ప్రచారం. ప్రగతి భవన్ లో ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు. ఇంత వరకూ లోపలి ఫోటోలు కానీ… దృశ్యాలు కానీ బయటకు రాలేదు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ జరిగింది. ఎమ్మెల్యేలందర్నీ ప్రగతి భవన్ కు తీసుకెళ్తానని కేసీఆర్ ప్రకటించారు కానీ తీసుకెళ్లలేదు. ఇప్పుడు ఈ భవనాన్ని ఆస్పత్రిగా మారుస్తామని.. టీ టీడీపీ హామీ ఇచ్చింది.
అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి అమరవీరుల కుటుంబంలో ఇంటికో ఉద్యోగం, ఇల్లు ఇస్తామని.. టీటీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు, ప్రొ. జయశంకర్ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు మరో ముఖ్యహామీ. విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులను తెస్తామన్నారు టీ టీడీపీ నేతలు. ఇక ఉద్యోగాల విషయంలో ప్రతి ఏటా ఉద్యోగ కాలెండర్ విడుదల, తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3వేల భృతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు వంటి హామీలున్నాయి.
బడ్జెట్లో విద్యారంగానికి రూ. 5వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, కౌలు రైతులకూ మాఫీ వర్తింపు, కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కేజీల చొప్పున రేషన్ బియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్ కూడా అమలు చేస్తామని టీ టీడీపీ ప్రకటించింది. కూటమి పక్షాలన్నీ విడివిడిగా… మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. అన్ని పార్టీల మేనిఫెస్టోలతో.. కనీస ఉమ్మడి ప్రణాళికను రెండు రోజుల్ోల ప్రకటించే అవకాశం ఉంది. దీనికి చైర్మన్ గా కోదండరాం ఉంటారు.