చాన్నాళ్ల తరువాత దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం అనే కాన్సెప్ట్ ని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెన్నై వెళ్లిన పవన్, అక్కడ ప్రెస్ మీట్ లో ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్థావించారు. అక్కడ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, మంత్రి నారా లోకేష్ మీద విమర్శలు చేశారు. పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికకాని నాయకుడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఏపీలో ఉన్నారన్నారు. జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు దిశగా ఏపీ సీఎం చేస్తున్న ప్రయత్నం అంశమై ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే.. తనకు కలిసే ఉద్దేశం లేదన్నారు. అంతేకాదు, చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాలను ఇవ్వవన్నారు. చంద్రబాబు ఎవరితో ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా ఉంటారో చెప్పలేమన్నారు! ఆయనతో కలిసి వెళ్తున్న పార్టీలన్నీ ఏదో ఒకరోజు మోసపోవడం ఖాయమన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు అన్ని రాష్ట్రాలూ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు! ద్రవిడనాడు అనేది ఒక భావోద్వేగమైన అంశం అన్నారు. గడచిన రెండు దశాబ్దాలుగా దక్షిణాది కొంత వివక్షకు గురైందన్నారు. దక్షిణాది సంస్కృతిని ఉత్తరాధి అర్థం చేసుకోవాలన్నారు. వేర్పాటు వాద భావనతో తాను మాట్లాడటం లేదనీ, ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశమన్నారు. ఎందుకంటే, తాము తెలంగాణలో ద్వితీయ స్థాయి పౌరులుగా పదేళ్లపాటు ఉన్నామనీ, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తాను మాట్లాడుతున్నా అన్నారు.
దక్షిణాదిలో మరో రాజధాని ఉండాలన్నారు! జమ్మూ కశ్మీర్ మాదిరిగానే… దక్షిణాది ప్రాంతంలో మరో రాజధాని ఏర్పాటు దిశగా కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. దేశాన్ని రెండుగా విభజించాలన్నది అభిప్రాయం తనది కాదనీ, దక్షిణాది కూడా దేశంలో భాగమని పవన్ చెప్పారు. ఇదే అంశమై భావసారూప్యత గల నాయకులతో తాను కలిసి చర్చిస్తానని, ఆ తరువాత ఒక అజెండా రూపొందిస్తానని పవన్ అన్నారు. ఇది ఒక రాత్రిలో జరిగిపోయేది కాదనీ, కొంత సమయం పడుతుందన్నారు. ఇది తనను ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం కాదనీ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనం కోసమనీ. ఆంధ్రా కూడా ద్రవిడ సంస్కృతిలో భాగమన్నారు. దక్షిణాది నుంచి బలమైన నాయకులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మన ఉనికిని కేంద్రానికి చాటి చెప్పాల్సిన సమయం ఇదన్నారు పవన్..! ఇక, తెలంగాణ ఎన్నికల్లో పోటీ గురించి మాట్లడుతూ… తాము ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోలేదనీ, అందుకే సిద్ధం కాలేదన్నారు. ఆంధ్రాలో సొంతంగానే పోటీ చేస్తున్నామని పవన్ చెప్పారు.
నిజానికి, ఉత్తరాది ఆధిపత్యం అంటూ ఆ మధ్య ఏపీలో జనసేనాని నిర్వహించే సభల్లో ఇదే ప్రముఖంగా ప్రస్థావించేవారు. ఏపీ విభజనను కూడా ఇదే కోణం నుంచి విశ్లేషించేవారు. కానీ, ఎప్పుడైతే టీడీపీతో వైరం మొదలుపెట్టారో ఆ కాన్సెప్ట్ ని వదిలేశారు. ఇప్పుడు మళ్లీ పైకి తెచ్చారు. మరి, ఈ దిశగా తాను చేస్తానంటున్న ప్రయత్నం ఏ రకంగా కార్యరూపంలో దాల్చుతుందో, పవన్ వ్యూహమేంటో మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.