వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని చెప్పడానికి కేసీఆర్… ఒక మాటను నమ్ముకున్నారు. “గెలవకపోతే.. రాజకీయ సన్యాసానికి నేను సిద్ధం..మీరు సిద్దమా..” అంటూ..పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా ముఖాముఖిలో చాలా గట్టిగానే ఈ మాట చెప్పారు. దానికి మరో రెండు కలగలిపి.. ఎవరికీ కనిపించను..మొహం చూపించను అంటూ.. చెప్పేసరికి చాలా సెటైర్లు పడ్డాయి. అయినప్పటికీ.. కేటీఆర్.. అదొక్కటే తారక మంత్రంలా ఎక్కడికి వెళ్లినా వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని గురిపెట్టి.. కొడంగల్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలోనూ.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ అదే సవాల్ వినిపించారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా? అని సవాల్ విసిరారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీవి కాదన్నారు. కేసీఆర్ను తిట్టగానే పెద్దవారు కాలేరని చెప్పుకొచ్చారు. నామినేషన్ల చివరి రోజు.. రేవంత్ రెడ్డి ఓ రకంగా బలప్రదర్శన చేశారు. దాంతో.. రేవంత్ ను అడ్డుకోవడం… టీఆర్ఎస్ వల్ల కాదన్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో.. అంత కన్నా భారీగా రోడ్ షోను నిర్వహించాలని.. పట్నం బ్రదర్స్ .. తాండూరు నుంచి సైతం జనాలను తరలించారు. అయినప్పటికీ.. రేవంత్ నామినేషన్ ప్రదర్శనకు వచ్చినంత ఎఫెక్ట్ రాలేదు. కొడంగల్ లో రేవంత్ పై ఒత్తిడి పెంచి.. ఆయన ఇతర నియోజకవర్గాలకు కూడా వెళ్లకుండా చేయాల్నన ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది.
కానీ రేవంత్ మాత్రం.. నియోజకవర్గాన్ని పూర్తిగా.. సోదరుడు తిరుపతి రెడ్డికి అప్పగించి.. ఇతర చోట్ల ప్రచారం చేస్తున్నారు. అయినా..కేటీఆర్ కు.. ఈ రాజకీయ సన్యాసం సవాల్ ఎలా తారకమంత్రంగా అనిపిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయాల్లో ఇలా సవాల్ చేసేవాళ్లు ఎవరూ మాట నిలబెట్టుకున్నట్లు చరిత్రలో లేదు. మరి కేటీఆర్ ను ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటారో మరి..!