ఒకే ఒక్కడులో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రిగా చేశాడు… గుర్తుంది కదా? అలా… చిరంజీవి ఒక గంట డైరెక్టర్ అవతారం ఎత్తాడు. సైరా కోసం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓరోజు సురేందర్ రెడ్డి సెట్‌కి ఓ గంట ఆలస్యంగా వచ్చాడట. అప్పటికే చిరు సెట్లో ఉన్నాడని, ఆ రోజు తీయాల్సిన సన్నివేశం చదివి… దాన్ని తనదైన స్టైల్లో తెరకెక్కించాడని ఇన్సైడ్ వర్గాల టాక్. సూరి సెట్లో అడుగుపెట్టే సమయానికి చిరు… కెప్టెన్ కుర్చీలో కూర్చుని ఉన్నాడని, చిరు ని డైరక్షన్ మూడ్‌లో చూసి.. డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక, షాట్ అయ్యేంత వరకూ ఆ పక్కనే నిలబడి చూశాడని సమాచారం అందుతోంది. చిరు కి ఇలా ఆపధర్మ దర్శకుడిగా పనిచేయడం కొత్తకాదు. అప్పట్లో కొన్ని చిత్రాలకు ఇలానే అనివార్య కారణాల వల్ల దర్శకుడిగా మారాల్సివచ్చింది. గ్యాంగ్ లీడర్లో కొన్ని సన్నివేశాల్ని కూడా చిరు ఇలానే డైరక్ట్ చేశాడు. ఇప్పుడు మరోసారి దర్శకుడైపోయాడు. 150 చిత్రాల్లో నటించిన అనుభవం కదా.. అప్పుడప్పుడూ దర్శకత్వ ప్రతిభ చూపించడం తప్పేం లేదు. త్వరలో చిరు పూర్తి స్థాయి దర్శకుడిగా అవతారం ఎత్తుతాడేమో చూడాలి.