ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలీక్కి వచ్చినా… ఇప్పుడు స్నేహపూర్వక పోటీ అనే అంశం సమస్యగా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ జన సమితికి ఇస్తామన్న సీట్లు ఇస్తున్నట్టుగా ప్రకటించి… ఆ తరువాత, కొన్ని నియోజక వర్గాల్లో స్నేహపూర్వక పోటీ అంటూ కొంతమంది అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ లు ఇచ్చి నామినేషన్లు వేయించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కాంగ్రెస్ తీరుపై కోదండరామ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ విమర్శించారు. నామినేషన్ల ఉప సంహరణ గడువులోగా తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఉపసంహరించాల్సిందే అంటూ ఆయన పట్టుబడుతున్నారు.
నిజానికి, ఇదే అంశమై కీలక నేతలతో కోదండరామ్ బుధవారమే చర్చించినా… సమస్య ఒక కొలీక్కి రాలేదు. దీంతో గురువారం ఉదయం కోదండరామ్ నివాసానికి వెళ్లి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. స్నేహపూర్వక పోటీ పేరుతో తాము ఎందుకు బరిలోకి దిగాల్సి వచ్చిందీ, అభ్యర్థులకు ఎందుకు బీఫామ్స్ ఇచ్చారనే అంశాన్ని కోదండరామ్ కి వివరించినట్టు సమాచారం. అయితే, ఇవాళ్ల తెలంగాణ జన సమితి కోర్ కమిటీ మీటింగ్ ఉంది. దీన్లో ఈ అంశాన్ని కీలకంగా చర్చిస్తారని సమాచారం. అనంతరం కోదండరామ్ మీడియాకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ స్నేహ పూర్వక పోటీ విషయమై కాంగ్రెస్ వెనక్కి తగ్గే ధోరణిలో ఉన్నట్టు కనిపించడం లేదు! ఎందుకంటే, కోదండరామ్ తో జరిగిన చర్చలో ఉత్తమ్ ఇచ్చిన వివరణ అలానే ఉందని తెలుస్తోంది. కొన్ని నియోజక వర్గాల్లో స్నేహ పూర్వక పోటీ ఉంటుందని మొదట్నుంచీ అనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు అదనంగా మరో రెండూ లేదా మూడు స్థానాల్లో మాత్రమే అదే తరహా పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పినట్టు సమాచారం. ఇంకోటి… ఆయా నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్థుల కంటే, తెరాస అభ్యర్థుల విజయావకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని తమకి సమాచారం ఉన్నట్టుగా ఈ భేటీలో ఉత్తమ్ అభిప్రాయపడ్డట్టు చెబుతున్నారు. అంటే, తాము పోటీకి దిగిన నియోజక వర్గాల్లో వెనక్కి తగ్గలేని పరిస్థితి ఉందనీ, నామినేషన్లను ఉపసంహరించుకుంటే కూటమికే నష్టం అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నమాట.