తెలుగు360 రేటింగ్: 1/5
దాదాపు రెండేళ్లకుపైగా నిర్మాణం జరుపుకుంది శరభ చిత్రం. భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తమిళన దర్శకుడు శంకర్, తెలుగులో ఆర్. నారాయణమూర్తి వంటి పలువురు దర్శకుల వద్ద ఇరవై ఏళ్లపాటు సహాయకుడిగా పనిచేసిన ఎన్.నరసింహారావు దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆకాష్‌కుమార్ ఈ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటించింది. దాదాపు నలభై కోట్ల వ్యయంతో నిర్మాత అశ్వినీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుందాం…
కథ
సింగపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (జయప్రద) పూల వ్యాపారం చేస్తుంటుంది. కొడుకు శరభ(ఆకాష్‌కుమార్) అంటే ఆమెకు పంచప్రాణాలు. మావయ్య చిన్నారావు(నాజర్)తో కలిసి శరభ జులాయిగా తిరుగుతుంటాడు. క్షుద్రశక్తుల కారణంగా ఆపదలో ఉన్న మినిస్టర్ కూతురు దివ్యను(మిస్తీ చక్రవర్తి) కాపాడే బాధ్యత శరభ చేపడుతాడు. ఇద్దరి మధ్య మొదలైన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారుతుంది. రాక్తాక్ష(చరణ్‌రాజ్) అనే తాంత్రికుడు దివ్యతో పాటు శరభ కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. పద్దెనిమిది శక్తి పీఠాల చేత బందీ కాబడిన కోట్లాది పిశాచగణాలను విడిపించి ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని రక్తాక్ష తండ్రి చంద్రక్షా ప్రయత్నిస్తాడు. శరభ తండ్రి కార్తవ్యరాయుడు(నెపోలియన్)చంద్రాక్షను చంపుతాడు.ఈ ప్రమాదంలో కార్తవ్య రాయుడు చనిపోతాడు. తండ్రి లక్ష్యాన్ని అతడి కొడుకైనా రక్తాక్ష చేపడుతాడు. విశిష్టజాతకంలో జన్మించిన దివ్యను బలి ఇచ్చి తండ్రిని తిరిగి ప్రాణంపోయాలనుకున్న రాక్తక్ష ప్రయత్నాన్ని దైవశక్తి సహాయంతో శరభ ఎలా అడ్డుకున్నాడు. ఈ ప్రయత్నంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అన్నదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ
దైవ శక్తికి దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. రొటీన్ కమర్షియల్ కథాంశానికి గ్రాఫిక్స్ హంగులను మేళవించి దర్శకుడు నరసింహారావు ఈ కథ రాసుకున్నారు. నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమా కథేమిటన్నది తొలి సన్నివేశంతోనే అర్థం అవుతుంది. ప్రపంచానికి అధిపతి కావడానికి ప్రత్యేక జాతకంలో జన్మించిన అమ్మాయిని బలి ఇస్తే సరిపోతుందని ప్రతినాయకుడు చెప్పే సన్నివేశాలతోనే కథపై ప్రేక్షకుడికి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. సినిమా మొదలైనరెండు నిమిషాల్లో ముగింపు ఏమిటో చెప్పిన దర్శకుడు దానిని చూపించడానికి ప్రేక్షకుల్ని రెండు గంటలు ఎదురుచూసేలా చేశారు. కథలో కొత్తదనం లేకపోయినా కథనాన్ని నడిపించే తీరులో వైవిధ్యత కోసం ప్రయత్నించలేదు. హీరో పరిచయ ఘట్టాలన్నీ పదేళ్ల క్రితం నాటి సినిమాల్ని తలపిస్తాయి. తల్లీకొడుకు అనుబంధంతో ముడిపడిన కథ ఇది. కానీ జయప్రద, ఆకాష్‌కుమార్ అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించేలా బలమైన సన్నివేశాల్ని రాసుకోలేకపోయారు. నాయకానాయికల మధ్య ప్రేమకథను అందంగా ఆవిష్కరించే అవకాశం ఉండి ఉపయోగించుకోలేదు. ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు, పాటల్లో ఆసక్తి లోపించింది. అవన్నీ సినిమా నిడివిని పెంచడానికే ఉపయోగపడ్డాయి. రొటీన్‌గా సాగుతున్న కథను ఫ్లాష్బ్యాక్పేరుతో మలుపుతిప్పే ప్రయత్నం చేశారు. నెపోలియన్, జయప్రదలపై వచ్చే ఆ ఎపిసోడ్‌తో దర్శకుడు గాడిన పడినట్లే అనిపిస్తుంది. ఆ ఆసక్తిని పూర్తిగా ఆద్యంతం కొనసాగించలేకపోయారు. అనవసరపు సన్నివేశాలతో కాలక్షేపం చేస్తూ చివరలో హడావిడిగా సినిమాను ముగించేశారు. తాంత్రిక శక్తులు కలిగి తనకన్న ఎన్నో రేట్లు బలవంతుడైన వ్యక్తిగా హీరో పోరాడే సన్నివేశాల్లో లాజిక్ కనిపించదు. తాను వెతుకుతున్న అమ్మాయి కళ్ల ముందే కనిపిస్తున్న ప్రతినాయకుడు పూజల పేరుతో కాలక్షేపం చేస్తూ కనిపిస్తాడు. సినిమా మొత్తం దారితెన్ను లేకుండా సాగిపోతూనే ఉంటుంది.
గ్రాఫిక్స్‌పై పెట్టిన శ్రద్ధ దర్శకుడు కథ, కథనాలపై పెడితే బాగుండేది. శక్తి, ఢమరుకంతో పాటు గతంలో తెలుగులో వచ్చిన పలు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. దాంతో ఆ సినిమాల్నే మరోసారి చూసిన అనుభూతి కలుగుతుంది.తన గురువులైన శంకర్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం, ఆర్.నారాయణమూర్తి నుంచి సామాజిక స్పృహతో కూడిన కథాంశాల్ని తెరకెక్కించే విధానాన్ని నేర్చుకున్న నరసింహారావు రెండింటిని మేళవిస్తూ సినిమాను జనరంజకంగా చెప్పాలనే ప్రయత్నంతో పూర్తిగా తడబడిపోయారు.
నటీనటుల పనితీరు
కథానాయకుడిగా ఆకాష్‌కు ఇదే తొలి సినిమా. ఆ అనుభవ లేమి అడగడుగునా కనిపిస్తుంది. హావభావాలు, నటన పరంగా చాలా నేర్చుకోవాలి. అతడి పాత్రకు ఇతరులతో డబ్బింగ్ చెప్పించడం వల్ల ఆకాష్ హావభావాలకు, సంభాషణలకు కొన్ని చోట్ల పొంతన కుదరలేదు. మిస్తీ చక్రవర్తి పాత్రే కథకు కీలకం. ఈ పాత్ర కోసం నటనానుభవం ఉన్న హీరోయిన్ను తీసుకుంటే బాగుండేది. సింగిల్ ఎక్స్ప్రెషన్తో మిస్తీ సినిమా మొత్తం కనిపించింది. ఆమె ముఖంలో కనిపించేది భాదో, అనందమే, ప్రేమ ఏదీ అర్థం కాదు. ఈ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేసింది సీనియర్ నటి జయప్రద. పార్వతమ్మ పాత్రకు ప్రాణంపోసింది. ఆమె కథలో బలం లేకపోవడంతో ఆమె నటన వృథాగానే మిగిలిపోయింది. నాజర్, నెపోలియన్ తమ అనుభవంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ప్రతినాయకులుగా చరణ్‌రాజ్‌తో పాటు చంద్రక్షా పాత్రధారులు పర్వాలేదనిపించారు.
కోటి బాణీలు తన పాత సినిమాల్ని తలపించాయి. గ్రాఫిక్స్ సన్నివేశాలు బాగున్నాయి.. దర్శకుడు చెప్పిన కథను నమ్మి నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు. కొడుకుకు హీరోగా మంచి విజయాన్ని అందించడం కోసం అతడు పడిన తపన ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
తీర్పు
కథ లేకుండా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదు. అది తెలుసుకోక కోట్ల రూపాయల్ని వృథా చేసుకునేవాళ్లకు ఈ సినిమా ఒక గుణపాఠంగా మిగులుతుంది.
ఫైనల్ టచ్: రభస
తెలుగు360 రేటింగ్: 1/5