తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించడానికి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లంతా హైదరాబాద్ లో మకాం వేశారు. ఆజాద్, జైరాం రమేశ్, మొయిలీ, అహ్మాద్ పటేల్ , డీకే శివకుమార్ లాంటి నేతలంతా హైదరాబాద్ లో ఉన్నారు. అనుకోని విధంగా వచ్చి పడిన ఎన్నికలైనా సరే.. పూర్తి స్తాయిలో ఏఐసిసి తెలంగాణపై దృష్టి పెట్టింది. ఎన్నికలు జరుగుతున్న మరో మూడు రాష్ట్రాల్లో చత్తీస్ గఢ్ లో పోలింగ్ ముగిసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడిందన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే.. ఏఐసిసి చతురంగ బలాలు పూర్తిగా తెలంగాణపై దృష్టి పెట్టాయి. టాస్క్ తెలంగాణను పూర్తి చేయడానికి స్కెచ్ రెడీ చేశారు. బరిలో ఉన్న రెబెల్స్ అందర్నీ బుజ్జగించారు.
అవసర మనుకుంటే ఎన్నికల వరకూ వ్యూహ రచనలో కర్నాటక మంత్రి శివ కుమార్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మేడ్చల్లో శుక్రవారం జరగనున్న సోనియా సభను విజయవంతం చేయడంతో పాటుగా ప్రచార కార్యక్రమాలపైనా అహ్మద్ పటేల్ దృష్టి పెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రసంగించబోతున్న సోనియాగాంధీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయమని.. విజ్ఞప్తి చేస్తే.. ప్రజల స్పందన అనూహ్యంగా ఉండే అవకాశం ఉందన్న అంచనా ఉంది. ఈ దిశగానే.. సోనియా స్పీచ్ బలంగా .. తెలంగాణ వాదుల మనసుల్ని తాకేలా ఉండదనుందని చెబుతున్నారు.. నిజానికి తెలంగాణలో సోనియాకు ఉన్న ఇమేజ్ వల్లే.. ఆమె ప్రచారానికి వస్తున్నారు. అనారోగ్య కారణాలతో.. రాజకీయ కర్యకాలాపాల్లో పాల్గొనడం… సోనియా గాంధీ తగ్గించుకున్నారు. ఎన్నికల ప్రచారసభలకు అసలే వెళ్లడం లేదు. ఎన్నికలు జరుగుతున్న మిగతా నాలుగు రాష్ట్రాలకు కూడా వెళ్లలేదు. కానీ తెలంగాణకు మాత్రం వస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టిందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. తెలంగాణ ఇచ్చిన సోనియా.. ఒక్క ఓటు అడిగితే.. ప్రజలు మన్నించరా.. అనేది కాంగ్రెస్ వాదన.
ఈ విషయం ముందుగానే పసిగట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు చంద్రబాబును కాంగ్రెస్ తెలంగాణలోకి తీసుకొస్తోందని.. తరిమేయాలని ప్రజలకు పిలిపునిస్తున్నారు. మరో వైసు సోనియాకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ పూర్తి స్థాయిలో వెళ్లకుండా… విమర్శలకు పదును పెట్టారు. అంటే ఇక నుంచి.. తెలంగాణ తెచ్చింది ఎవరు..? ఇచ్చింది ఎవరు..? అన్నదే ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.