బీజేపీలో పెద్ద పుడింగి నేతగా ఉన్న రామ్మాధవ్ వ్యవహారశైలి మరో సారి వివాదాస్పదమయింది. చివరికి… జమ్మూకశ్మీర్ నేత ఒమర్ అబ్దుల్లాకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులపై అసువుగా బురద జల్లేయడం.. బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి… తమ మాటలకు.. బోలెడంత ప్రచారం ఇచ్చే మీడియా అండగా ఉంది కాబట్టి.. వాళ్లు ఎంత బడితే.. అంత ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఏపీలో జీవీఎల్ నరసింహారావు అనే యూపీ ఎంపీ చేసే రచ్చ నుంచి.. బీజేపీకి భావి అధ్యక్షుడుగా.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్ చేసే విమర్శల వరకూ..అన్నీ అలాగే ఉంటాయి. ఈ రామ్ మాధవ్ .. జమ్మూకశ్మీర్ కు బీజేపీ తరపున ఇన్చార్జ్ గా ఉన్నారు. ఆయన పని తనం కారణంగానే… బీజేపీ – పీడీపీ ప్రభుత్వం … కుప్పకూలిపోవాల్సి వచ్చింది.
ఆయన కశ్మర్ లో రాజకీయ వ్యవహారాల చక్కబెట్టాల్సింది పోయి… పీడీపీని ముంచేసి.. బీజేపీనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న దురాలోచన చేశారు. దాని ప్రకారం.. పీడీపీకి మద్దతు ఉపసంహరించుకుని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చాలని చూశారు. చివరికి అది బ్యాక్ ఫైర్ అయింది. పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడంతో.. ఉన్న పళంగా… అదేదో తమ ఆస్తి అయినట్లు.. అసెంబ్లీ రద్దు చేసి పడేశారు. తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా…కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు .. పాకిస్థాన్ సూచనలతోనే… పొత్తులు పెట్టుకుంటున్నాయంటూ అసువుగా ఆరోపించేశారు. అదేదో జీవీఎల్ నరసింహారావు పీడీ అకౌంట్లు ఆరోపించిట్లుగా.. ఆరోపించేశారు. సున్నితమైన విషయం కావడంతో.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా.. నిరూపించాలని చాలెంజ్ చేశారు.
కేంద్రం దగ్గర రా, ఎన్ఐఏ, ఐపీతో పాటు… పంజరంలో చిలుకలా ఉన్న సీబీఐతో విచారణ చేయించి అయినా సరే.. ఆరోపణలు నిరూపించాలని .. లేకపోతే క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు. రామ్ మాధవ్ ఆరోపణలు… మిస్ ఫైర్ అయినట్లు తేలడంతో.. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ప్రజాస్వామ్య విరుద్ధంగా… అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా.. పాకిస్థాన్ పేరు తేవడంపై… అంతటా ఆగ్రహం వ్యక్తమయింది. దీంతో రామ్ మాధవ్.. క్షమాపణలు చెప్పారు. రాజకీయంగానే ఆరోపించాను కానీ.. వ్యక్తిగతంగా కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. బీజేపీ నేతలకు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. బురద జల్లడం తమ జన్మహక్కని భావిస్తూంటారు.