ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా గులామ్ నబీ ఆజాద్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రంలో పార్టీ పరిస్థితితోపాటు, ఇక్కడి నాయకులకు సంబంధించిన పూర్తి అవగాహనా అనుభవం ఆయన ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూడా త్వరలో రాష్ట్రంలో ప్రచారానికి రాబోతున్నారు. ఆ పార్టీ స్టార్ కేంపేయినర్లలో రాహుల్ గాంధీ, సోనియా, మన్మోహన్ సింగ్ ల తరువాత ఉన్నది ఆయనే. ఓపక్క తెరాస ప్రచారం పెంచుతున్న నేపథ్యంలో ఆజాద్ ను వీలైనంత త్వరగా రాష్ట్రానికి రప్పించే అవకాశం ఉందని సమాచారం! ఎందుకంటే, ఆయన రాక అవసరం ఇప్పుడు కనిపిస్తోంది కాబట్టి!
సీట్ల పంపకాలు పూర్తయ్యాక.. కాంగ్రెస్ లో అసంతృప్తులు ఏ స్థాయిలో రగులుకున్నాయో తెలిసిందే. టిక్కెట్ దక్కని నేతల్ని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం బుజ్జగించినా, ఇంకా సరిపోలేదనే అభిప్రాయమే పార్టీ వర్గాల్లో ఉంది. ప్రస్తుతానికి కామ్ గా ఉంటున్నా… ఎన్నికలు జరిగే రోజుకు వచ్చేసరికి ఈ అసంతృప్త నేతలు ఎలా వ్యవహరిస్తారనే ఆందోళన రాష్ట్ర నాయకత్వానికి ఉంది. అందుకే, మరోసారి ఆజాద్ తో బుజ్జగింపులు చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎలాగూ ఇక్కడి నేతలతో ఆయనకి మంచి స్నేహం ఉండటం, ఇంకోపక్క రాహుల్, సోనియాలతో ఆయనకి సాన్నిహిత్యం ఉండటంతో ఆజాద్ మంత్రాంగం బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నారు.
ఆజాద్ రాక అవసరాన్ని స్పష్టంగా చూపించే మరో కారణం కూడా కనిపిస్తోంది. అదేంటంటే… ప్రచారంలో భాగంగా ముస్లిం ఓటర్లను తెరాస బాగా ఆకర్షిస్తున్నారనే భావన ఏర్పడుతోంది. గురువారం నాడు ఓ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… అసదుద్దీన్ ఒవైసీని బాగా వెనకేసుకొచ్చారు. నిర్మల్ లో ప్రచారం చేయకుండా ఉంటే ఆయనకి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ఎరజూపారనీ, పాతిక కోట్లు ఇచ్చినా ఆయన్ని ఎవ్వరూ కొనలేరన్నారు కేసీఆర్. మజ్లిస్, తెరాస మధ్య స్నేహం ఇంత తీవ్రంగా ఉండటంతో… ఇప్పుడు ఆజాద్ ను రంగంలోకి దించి, ప్రచారం చేయించడం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకర్షించొచ్చు అనేది కాంగ్రెస్ తాజా వ్యూహంగా తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆజాద్ ప్రసంగాలను ప్రముఖంగా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.