తెలంగాణలో బీసీలు అణచివేతకు గురయిపోతున్నారని… తనకు అసెంబ్లీ టిక్కెట్ వచ్చే వరకూ .. అవిశ్రాంతంగా పోరాడు.. ఆర్.కృష్ణయ్య. కొన్ని సంఘాలతో.. ప్రతి రోజూ సమావేశాలు నిర్వహించారు. రోజువారీ ప్రెస్మీట్లు ఏర్పాటు చేశారు. ప్రతీ సారీ.. బీసీలకు అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల తర్వాత ఏకంగా బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆశ్చర్యపోయినా.. ఆయన బీసీలకు జరిగిన అన్యాయాన్నే ప్రశ్నిస్తున్నాననన్నారు. తర్వాత వాయిదా వేసుకున్నారు. బీసీ డిమాండ్లు అంటూ…జానారెడ్డిని పదే పదే కలిశారు. చివరికి.. డిమాండ్ సాధించుకోగలిగారు. జానారెడ్డి గెలిపించుకోగలిగిన అసెంబ్లీ నియోజకవర్గం.. మిర్యాలగూడ నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. ఇక బీసీ సంక్షేమం చక్కగా ఉంటుందా..? అందరికీ న్యాయం జరిగినట్లేనా..?
వీటిపై ఆర్. కృష్ణయ్య స్పందనేమిటో కానీ.. నామినేషన్లు వేస్తూ.. ఆయన డిక్లేర్ చేసిన ఆస్తులు చూస్తే మాత్రం… బీసీల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం… అంతులేని విజయాలు సాధించేసినట్లు నిర్దారించేసుకోవాలి. ఎందుకంటే.. నాలుగేళ్ల కిందట.. ఉన్న ఆయన ఆస్తులకు.. ఇప్పటి ఆస్తులకు పొంతనే లేదు మరి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎల్బీనగర్‌నుంచి పోటీ చేసిన ఆయన.. తన కుటుంబ ఆస్తులు… వారసత్వంగా వచ్చినవాటితో కలిపి.. విలువ రూ.22.82 లక్షలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మొత్తం అమాంతం పెరిగిపోయి.. రూ. 46.72 కోట్లకు చేరింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ఆర్.కృష్ణయ్య ఈ వివరాలను వెల్లడించారు. తమ వద్ద 2.8 కేజీల బంగారం, 34 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు.
గత ఎన్నికల తర్వాత ఆర్. కృష్ణయ్య ఏమైనా వ్యాపారం చేశాడా..? ఆస్తుల్లో అంత పెరుగుదల ఎక్కడి నుంచి వచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో అన్నీ వివరాలు చెబుతున్నారా..?. న్యాయబద్ధంగా సంపాదించుకుంటే.. దానికి సంబంధించిన సోర్సులేవో చెబితే.. ఎవరికీ అనుమానాలు రావు. కానీ కృష్ణయ్య మాత్రం.. వివాదం చెలరేగుతున్నా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఆయన మౌనం.. ఉద్యమ నేతలందర్నీ అనుమానించేలా చేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈవిషయంలో కృష్ణయ్య క్లారిటీ ఇస్తారా..? తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంతో కోట్లకు పడగెత్తామని చెబుతారా..? వ్యాపారం చేసి సంపాదించామంటారా..?