తెలంగాణకు చంద్రబాబు నాయుడు అవసరమా… ఇదే పాయింట్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు కేసీఆర్. అమరావతికి పంపించిన వ్యక్తిని మళ్లీ తీసుకొస్తారా అంటూ నేరుగా ప్రజలనే కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవసరం ఇక్కడేముంది అనేది గడచిన మూడురోజులుగా కేసీఆర్ మరింత తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ తొలిదశ ప్రచారంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ప్రధాన లక్ష్యంగా ప్రచారం సాగించారు. ప్రాజెక్టులు అడ్డుకుంటారు, అభివృద్ధి ఆగిపోతుంది, అధికారం అమరావతికి వెళ్లిపోతుంది… ఈ తరహా కామెంట్స్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మనకి అవసరమా అంటూ పర్సనల్ స్థాయిలో కేసీఆర్ అంటున్నారు. ఇంతకీ… ఈ తరహా కామెంట్స్ వెనక కేసీఆర్ అసలు ఉద్దేశం ఏంటనేది కొంత చర్చనీయాంశమే. కేవలం ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేసీఆర్ ఈ కామెంట్స్ చేయడం లేదు. వీటి వెనక చాలా దూరదృష్టి ఉందనే చెప్పుకోవచ్చు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో టీడీపీ 15 స్థానాలను దక్కించుకుంది. అంటే, సంస్థాగతంగా ఆ పార్టీకి ఉండాల్సిన ఉనికి, క్షేత్రస్థాయిలో కొంత కేడర్ అలానే ఉందనే అంశం కేసీఆర్ తెలియంది కాదు. ఆ పార్టీ మూలాలు రాష్ట్రంలో కొంత బలంగానే ఉన్నాయన్నది వాస్తవం. కేవలం నాయకత్వ లేమి మాత్రమే టీడీపీకి ఉన్న సమస్య. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా టీడీపీ 13 చోట్ల పోటీ చేస్తోంది. వీటన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఇదే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి రాబోతున్నారు. సినీ నటుడు బాలకృష్ణ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇప్పుడు టీడీపీ ఈ 13 స్థానాలు గెలుచుకోగలిగితే… మరో ఐదేళ్ల నాటికి టీడీపీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ఇదే బలమైన పునాదిగా చంద్రబాబు నాయుడు మార్చుకుంటానేది కేసీఆర్ కి ఉన్న స్పష్టత. ఆ అవకాశం ఇవ్వకూడదనేదే కేసీఆర్ లక్ష్యం. మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీల కలయికను కేవలం ఈ ఎన్నికల వరకూ కుదిరిన ఓ ఒప్పందంగా కేసీఆర్ చూస్తున్నా… ప్రత్యేకించి టీడీపీని మాత్రం దూరదృష్టితో చూస్తున్నట్టుగా ఉంది. అందుకే, తెలంగాణకు చంద్రబాబు అవసరమా, టీడీపీ పనేముంది… ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఈ ఎన్నికలతో టీడీపీని రాష్ట్రంలో మరింత బలహీనం చేయాలనే ప్రధాన లక్ష్యంతో కేసీఆర్ విమర్శలు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు.