తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని.. తీవ్రంగా నష్టపోయామని… తీవ్రమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణకు చెందిన మురళీధర్ రావు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని… తెలంగాణలో.. భారతీయ జనతా పార్టీ.. ఐదు అసెంబ్లీ సీట్లను గెల్చుకుంది. ఆ ఐదు హైదరాబాద్ నగర పరిధిలోనే ఉన్నాయి. ఇతర జిల్లాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. అంతకు ముందు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో అంటే.. 294 అసెంబ్లీ సెగ్మెంట్లలో .. ఒక్కంటే.. ఒక్కటి.. అదీ అంబర్ పేటలో కిషన్ రెడ్డి మాత్రం గెలవగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక్క తెలంగాణలోనే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఐదు సీట్లను సాధించగలిగింది. అయినప్పటికీ.. తెలంగాణలో టీడీపీతో పొత్తు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని.. మురళీధర్ రావు చెప్పుకొస్తున్నారు.
గత ఎన్నికల తర్వాత బీజేపీ….టీడీపీతో పొత్తును ఏకపక్షంగా వదులుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రాక ముందే.. ఒంటరి పోటీ అని హడావుడి చేసింది. చివరికి వారి కోరికను చంద్రబాబు నెరవేర్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. పొత్తులు పెట్టుకోవడానికి ఎవరూ రాలేదు. చివరికి నామినేషన్లు ప్రారంభమయ్యాక.. ఊరూపేరూ.. సొంత గుర్తు కూడా లేని.. యువ తెలంగాణ అనే పార్టీ పొత్తు కోసం.. వస్తే.. రెడ్ కార్పెట్ వేసి.. పది సీట్లు ఇస్తున్నట్లు ప్రకటనలు చేశారు. మరి ఈ పొత్తు వల్ల బీజేపీ లాభపడుతుందేమో కానీ.. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల నుంచి టిక్కెట్ దొరకని వాళ్లు ఎవరు వస్తారో అని… గేటు దక్కర కాచుకుని కూర్చుని.. వారికి బీఫారాలు ఇచ్చారు. వారిలో చాలా మంది డమ్మీ అభ్యర్తులైపోయారు. కుత్బుల్లాపూర్ లాంటి చోట్ల ఏకంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు కూడా.
బీజేపీకి ప్రస్తుతం ఘంటాపథంగా గెలుస్తామని తెలంగాణలో చెప్పుకునే నియోజకవర్గం ఒక్కటీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో… రాజాసింగ్ తన హిందూత్వ నినాదంతో.. వ్యక్తిగత బలంతోపోటీదారుగా కనిపిస్తున్నారు కానీ.. మిగతా వారిలో గ్యారంటీ లేదు. అంబర్ పేటలో కిషన్ రెడ్డి పరిస్థితి కూడా డొలాయమానంలో ఉందని చెబుతున్నారు. ఇక వ్యక్తిగతంగా అభ్యర్థుల బలం ఉన్న చోట మాత్రం కాస్త పోటీ ఇస్తున్నారు. ఈ నియోజకవర్గాలన్నీ కలిపినా వేళ్ల మీద లెక్కపెట్టగలిగేవన్ని ఉంటాయి. ఇప్పుడు ఎలాగూ… టీడీపీతో పొత్తు పెట్టుని నష్టపోయామని పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి.. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదంటారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోతేనే.. వాళ్ల ఆవేదనకు అసలు అర్థం తెలిసి వస్తుందేమో..?