యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ.. ఆంధ్రప్రేదశ్ కు ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇచ్చి తీరుతామని.. సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఇదేమీ… ఏపీ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఇచ్చిన హామీ కాదు. తెలంగాణ గడ్డపై… తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి…మరీ.. ప్రాధాన్యతాంశాల్లో మొట్టమొదటిగా ప్రకటించిన అంశం. నిజానికి ఏపీ ప్రత్యేకహోదా అంశం.. సోనియా గాంధీ నోటి నుంచి వచ్చినప్పుడు… వేదికపై ఉన్న చాలా మందిలో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే..ఇది సందర్భం కాదేమోనన్నది వాళ్ల ఆలోచన.
కేసీఆర్ రెచ్చగొడుతున్న సమయంలో హోదా హామీ రిస్క్ కాదా..?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు… మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఏ అంశం వీలైతే.. ఆ అంశాన్ని.. వాడుకుంటున్నారు. చివరికి.. చంద్రబాబు ముస్లింలకు ఈద్ ముబారక్ అనే పదాన్ని కూడా.. సరిగ్గా చెప్పలేకపోయారని.. దశాబ్దాల కిందట.. జరిగిన అంశాన్ని కూడా.. ప్రజలకు వివరించి… రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఏపీ ప్రత్యేకహోదా ప్రస్తావనను మేడ్చల్ సభలో తీసుకొచ్చారు. ఇప్పటికే.. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే.. పరిశ్రమలు అన్నీ ఏపీకి తరలి పోతాయని… నిరుద్యోగం వస్తుదని… తెలంగాణ నాశనమైపోతుదని.. హరీష్ రావు లాంటి వాళ్లు అడిగినా.. అడగకపోయినా… ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ప్రకటన తర్వాత మరింత ఎక్కువగా ప్రచారం చేస్తారు. అయినా సరే.. సోనియా గాంధీ ఏ మాత్రం.. ముందూ వెనుకా ఆలోచించలేదు. ప్రత్యేకహోదా ఇస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ గడ్డ నుంచి ఎందుకు ప్రత్యేకహోదా హామీ..?
సోనియా గాంధీ… తెలంగాణ ఎన్నికల ప్రచారసభలో… ఏపీ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని.. కొంత మంది గొణుక్కుంటున్నారు. కానీ.. తాను ఏ కమిట్మెంట్తో అయితే తెలంగాణ ఇచ్చిందో.. తనకు ఏపీ పట్ల అదే కమిట్మెంట్ ఉందని.. సోనియా నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అతి విలువైన హామీ… ప్రత్యేకహోదానే. ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని బీజేపీ నేతలు పట్టుబట్టినా… ముందుగా ఐదేళ్ల సంగతి చూద్దామని.. ఐదేళ్ల పాటు.. ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కమిటయింది. దాన్ని బీజేపీ తుంగలో తొక్కింది. అందుకే.. తాము వస్తే.. బీజేపీలా చేయబోమని .. హామీ అంటే హామీనేనని.. ఆమె చెప్పదల్చుకున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ఎన్ని కావాలంటే అన్ని ప్యాకేజీలు ఇచ్చుకోండి… మాకు ఎలాంటి సంబంధం లేదు.. మాకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని.. టీఆర్ఎస్ సహా నేతలంతా.. అప్పట్లో సోనియాను డిమాండ్ చేశారు.
అధికారంలోకి వస్తే ఇచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండానా..?
సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా హామీని గుర్తు చేసి… మరీ ప్రకటించడం వెనుక మరో కారణం ఉందనే అంచనాలు ఉన్నాయి. రేపు కేంద్రంలో అధికారంలో ఉండి… ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సి వస్తే… తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా.. ఆమె ముందు జాగ్రత్తలు తీసుకున్నారంటున్నారు. మేము. ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పాం.. దానికి ప్రజామోదం ఉంది.. అని ప్రజలకు సర్ది చెప్పుకునే అవకాశం ఉందన్న వ్యూహం కూడా ఇమిడి ఉంటుందంటున్నారు.
టీడీపీతో పొత్తు బంధం పటిష్టానికా..?
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సేవియర్గా చంద్రబాబునాయుడు కనిపిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసి.. కాంగ్రెస్ నాయకత్వం కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు డిమాండ్ ఒక్కటే.. అదే ఏపీకి ప్రత్యేకహోదా ఈ విషయంలో… టీడీపీ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నామని.. చెప్పుకోవడానికి .. సోనియా గాంధీ… ఈ ప్రత్యేకహోదా అంశాన్ని గట్టిగానే చెప్పారనుకోవచ్చు. ఎలా చూసినా.. తెలంగాణ గడ్డపై ..ఎన్నికల సెంటిమెంట్లు రెచ్చగొట్టే సమయంలో… సోనియా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రకటన చేయడం మాత్రం సాహసమే. శభాష్ సోనియా అనక తప్పదు..!