మేడ్చల్ సభతో కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆ పార్టీ నేతలు సంతోష పడుతున్నారు. సెంటిమెంట్ గురి పెట్టి అనుకున్నది సాధించగలిగామంటున్నారు. తెలంగామ మేమే తెచ్చామంటున్న కేసీఆర్ వాదనకు గట్టి కౌంటర్ ను మేడ్చల్ సభ వేదికగా ఇచ్చామని కాంగ్రెస్ నేతలంటున్నారు. సోనియా గాంధీతో సభ ఏ లక్ష్యాన్ని గురి పెట్టి అయితే నిర్వహించారో ఆ లక్ష్యాన్ని స్పష్టంగా అందుకునేందుకు మెరుగైన కసరత్తే జరిగింది. సోనియా గాంధీ తన ప్రసంగంలో.. సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. అనారోగ్య కారణంగా ఎక్కువ సేపు మాట్లాడలేకపోయినప్పటికీ.. ఆమె చెప్పాలన్న కున్న విషయం… ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశం.. ప్రజాకూటమి శ్రేణులకు చేయాలనుకున్న దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు జన సమీకరణ కోసం ఎంత శ్రద్ధ పెట్టారో.. అంతకు మించి సభ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడానికి సరైన ప్రణాళిక రూపొందించుకున్నారు. దాని ప్రకారమే.. తెలగాణ సమాజానికి సూటిగా.. సందేశం పంపించారు.
రాజకీయంగా నష్టపోయినా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనే సందేశాన్ని అంతర్లీనంగా పంపుతూనే… తెలంగాణ తెచ్చామన్న కేసీఆర్ వాదనకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి జేఏసీని నడిపించిన కోదండరాం మాటల ద్వారానే… తెలంగాణ కోసం.. సోనియా చేసిన కృషిని వివరించగలిగారు. ఇక తన పాటలతో ఉద్యమంలో స్ఫూర్తి నింపిన గద్దర్ కూడా.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ కట్టబెట్టారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేటప్పుడు ఎంత ప్రసవ వేదనపడిందో.. ఓ పాట పాడి..తెలంగాణ సమాజాన్ని ప్రజాకూటమి వైపు మళ్లించేలా తన వంతు ప్రయత్నం చేశారు.
తెలంగాణ ఇచ్చింది సోనియా.. దాని కోసం.. కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేసేలా.. సభ జరిగింది. ఈ విషయంలో తెలంగాణ ప్రజల్లో వారు కోరుకున్న మార్పు వస్తుందా లేదా.. అన్నది.. డిసెంబర్ పదకొండున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.