చంటబ్బాయ్లో చిరంజీవి అల్లరిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుతుంటాం. పాండ్.. జేమ్స్ పాండ్ అంటూ జేమ్స్ బాండు పోజులిచ్చాడు చిరంజీవి. తన మేధస్సుని బయటపెట్టాలనుకునే అమాయకుడి పాత్ర అది. దాన్నిసృష్టించిన జంథ్యాలకు వేల వీరతాళ్లు! ఇప్పుడు సరిగ్గా అలాంటి కొలతలతోనే మరో సినిమా వస్తోంది. అదే.. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ. ఈ పేరు ఎంత వెరైటీగా ఉందో.. టీజర్ కూడా అంతే ఫన్నీగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే.. అప్పటి చంటబ్బాయ్ గుర్తుకురావడం సహజం. ఓ చెట్టుకింద జేమ్స్ బాండ్.. తనకో గ్యాంగ్.. వాళ్ల దగ్గరకొచ్చే రకరకాల కేసులు. ఇదీ స్థూలంగా కథ. దాన్ని ఎంత ఫన్నీగా పండించారో టీజర్ చూస్తే అర్థమైపోతోంది. ఇదో హిలేరియస్ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా కొత్తవారే. ఈమధ్య వచ్చిన `గూఢచారి` సీరియెస్గా ఓ క్రైమ్ థ్రిల్లర్ చెబితే.. ఈ గూఢచారి మాత్రం నవ్వులు పంచడానికే డిసైడ్ అయినట్టున్నాడు. మరి నయా.. చంటబ్బాయ్ ఎలాంటి ఫలితం అందిస్తాడో చూడాలి. నవీన్ పోలిశెట్టి, శ్రుతిశర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి స్వరూప్ దర్శకుడు.