జగిత్యాలజిల్లాలో ప్రత్యేకంగా నిలుస్తున్న నియోజకవర్గం జగిత్యాల. కూటమి అభ్యర్ధిగా కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో పాగా వేయాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సంజయ్ కే మరోసారి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. ఎంపీ కవిత నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్.రమణ జీవన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం.. అధికార వ్యతిరేకత..టీఆర్ఎస్పైనే ఉండటంతో జీవన్ రెడ్డి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వరుసగా మూడు సార్లు గెలిచారు. నాలుగోసారి కూడా.. తనదే విజయం అన్నంత ధీమాగా ఉన్నారు.
కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న జువ్వాడి నర్సింగ్‌రావు దూకుడుమీదున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. తన సొంత ఇమేజ్‌తో పాటు…, కూటమి తరపున ప్రచారం కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో ముందున్నారు. నాలుగేళ్లలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానంటూ ప్రజలముందుకెళుతున్నారు. ఇక్కడ ప్రజాకూటమి తరపున అడ్లూరి లక్ష్మణ్ బరిలో ఉన్నారు. అడ్లూరి నాలుగు సార్లు ఓడారన్న సానుభూతి ప్రజల్లో ఉంది. దీనికి తోడు కూటమి ఓట్లు కలిసొస్తాయనే ఆశతో ఉన్నారు. అయితే అడ్లూరికి సొంత పార్టీ నేతలే అక్కడక్కడా సహకరించడం లేదు.
జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్ అధిష్టానం. అభ్యర్ధుల తరుపున ఎంపీ కవిత ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు ప్రజాకూటమి అభ్యర్ధులు. అయితే ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా అయిన జగిత్యాలలో…టీఆర్ఎస్ పరిస్థితి అంత అనుకలంగా లేదనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై.. వ్యతిరేకత.. అధికార పార్టీని దడ పుట్టిస్తోంది. నియోజకవర్గానికి ఐదు నుంచి పది వేల వరకూ టీడీపీ ఓటు బ్యాంక్ ఉంటుందన్న అంచనా ఉంది. ఇదే.. కూటమి అభ్యర్థుల గెలుపోటముల్ని డిసైడ్ చేస్తుందంటున్నారు.