ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ మరణం ఆయన అభిమానుల్ని తీవ్రంగా కలచి వేసింది. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణం చేతనే… ఆయన కన్నుమూశారు. అయితే ఆఖరి క్షణాల్లో ఆయన తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. బెంగళూరులోని మండ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. ఈ వార్తని టీవీల్లో చూసిన అంబరీష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. పాత్రికేయులకు ఫోన్లు చేసి.. ఈ వార్త తనని కలచి వేసిందని, బాధితుల్ని పరామర్శించడానికి రావాలని ఉందని, అయితే తన ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పార్ట అంబరీష్. అప్పటి నుంచీ ఆయన బీపీ క్రమంగా పెరుగుతూ వచ్చిందని, హార్ట్ బీట్‌లో కూడా తేడా గమనించామని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అంబరీష్ – సుమలత జంటకు అభిషేక్ ఏకైక సంతానం. తనని హీరోగా చూసుకోవాలన్నది అంబరీష్ ఆశ. అందుకు తగిన ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అయితే ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు రెబల్ స్టార్.