తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కనీసం మంచి, మర్యాద కూడా లేవని విమర్శలు గుప్పించారు. తన దుస్తులపై కూడా.. కేసీఆర్ కామెంట్ చేసేవారని.. గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్..కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని.. మోడీతో ఒప్పందం చేసుకుని రాజకీయాలు మాత్రమే చేస్తూంటారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. కేసీఆర్ తీరుతో.. ఎంపీల పరువు పోయిన విషయాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కాళేశ్వరం జాతీయ హోదాపై పార్లమెంట్లో పోరాడమని కేసీఆర్ ఆదేశించారట. ఆ విధంగా చేసి.. కేంద్ర మంత్రి వద్దకు వెళ్తే.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని.. తెలంగాణ ప్రభుత్వం నుచి దరఖాస్తు చేయలేదని తేలిందన్నారు. కేసీఆర్ తీరుతో కేంద్రమంత్రి వద్ద తమ పరువుపోయిందన్నారు.
టీఆర్ఎస్లో తనకు జరిగిన అవమానాలను కూడా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. వివరించారు. చేవెళ్ల ఎంపీగా.. తనకు నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉన్నా.. మహేందర్ రెడ్డి బాధపడతారని..తనను పర్యటించకుడా కట్టడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్తానన్నా కేసీఆర్ వద్దనేవారన్నారు. మహేందర్ రెడ్డి తన మనుషులను కొట్టించారని, ఎంపీగా ఉండి కూడా అతనిపై కేసు పెట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కారణం తెలపకుండా పైలెట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేశారని, ఇప్పుడు ఆయనే మంత్రి మహేందర్ రెడ్డిని ఓడించబోతున్నారన్నారు. ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లనే టీఆర్ఎస్కు రాజీనామా చేశానన్నారు. ఒకప్పుడు జై తెలంగాణ అని .. ఉద్యమకారులు అంటే.. ఇప్పుడు జై కేసీఆర్, జై కేటీఆర్ అనాల్సి వస్తోందన్నారు.
ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ.. ఎవరికీ స్వేచ్చ లేదని.. అంతా కేసీఆర్, కేటీఆర్ చుట్టూనే తిరుగుదున్నారు. మంత్రుల్లో ఎవరికీ అధికారాలు లేవని… రాష్ట్ర బడ్జెట్ శాసనసభకు వచ్చేవరకు అది ఎలా ఉంటుందో కూడా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలియదన్నారు. పార్టీలో పరిస్థితుల వల్ల అనేక మంది అసంతృప్తిగా ఉన్నాని.. జితేందర్ రెడ్డి, కేశవరావు వంటి నేతలు కూడా పార్టీని వీడే అలోచనలో ఉన్నారని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెట్ కంపెనీ అని వారంతా మాట్లాడుకుంటూ ఉంటారన్నారు. మొత్తానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. సంచలనాత్మక విషయాలే బయటపెట్టారు. ఇవి కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. కొండా స్ఫూర్తితో టీఆర్ఎస్ నుంచి మరికొంత మంది బయటకు వస్తే.. అది గులాబీ పార్టీకి పెద్ద డ్యామేజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.