నిర్మల్ లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చారు. రెండే రెండు అంశాలను ప్రధానంగా ఎంచుకుని… తెలంగాణ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం కమల దళపతి చేశారు. ఒకటీ అభివృద్ధి, రెండూ మతం ప్రస్థావన! తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, తెరాసలకు అవకాశం ఇచ్చారనీ… తమకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి, మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్ది చూపిస్తామన్నారు అమిత్ షా. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ అన్ని రకాలుగా విఫలమయ్యారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చెయ్యలేదనీ, ప్రతీ ఇంటికీ గోదావరి జలాలను తెప్పిస్తామని అదీ చెయ్యలేకపోయారన్నారు.
ఇక, మజ్లిస్ ను ఎదుర్కొనే దమ్ము ఒక్క భాజపాకి మాత్రమే ఉందంటూ ఆ అంశాన్ని ప్రముఖంగానే అమిత్ షా చెప్పారు. ఆ పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ నిర్వహించలేకపోతున్నారని ఆరోపించారు. ఇదే భూమ్మీద హిందూ దేవతల్ని అక్బరుద్దీని అవమానిస్తే.. కేసీఆర్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంలో చనిపోయినవారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదుగానీ, ఒవైసీ కుటుంబం ఆహ్వానిస్తే బిర్యానీ తినడానికి వెళ్లడానికి సమయం ఆయన దగ్గర ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అవసరమా అనీ, కేంద్రంలో తమ పాలన ఉండగా మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉండవని అమిత్ షా స్పష్టం చేశారు.
అభివృద్ధి చేస్తామని అమిత్ షా చెబితే, తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉందా..? అంటే, కచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇలానే అభివృద్ధి చేస్తామని నమ్మబలికి చివరికి ఏం చేశారో అందరూ చూస్తున్నదే. రాజకీయ లబ్ధి లేకపోతే ఏ రాష్ట్రంలోనూ భాజపా మార్కు అభివృద్ధి అనేది కనిపించదు అనే ఒక స్థాయి నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి, ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలంటే ఈ అభివృద్ధి హామీ ఏమంత ఆకర్షణీయంగా కనిపించడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.
రెండోది… మతం! మజ్లిస్ ను ఎదుర్కొనే సత్తా భాజపాకి మాత్రమే ఉందని అమిత్ షా అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మజ్లిస్ తో పోటాపోటీగా నిలబడే పార్టీ అధికారంలోకి రావాలా వద్దా… అనే చర్చ తెలంగాణలో జరగడం లేదే..! ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి అంశాలు భాజపాకి మైలేజ్ ఇచ్చాయేమోగానీ, దక్షిణాదిన ఇలాంటి వాదనను తెరమీదికి తేవడం వల్ల భాజపాకు లాభించే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. కాబట్టి, ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలను భాజపా ఈ కోణం నుంచి ఆకర్షించడమూ కొంత కష్టంగానే కనిపిస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం.