ఆరు నెలల తర్వతా జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినందున తెలంగాణలో పోటీ చేయడం లేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న క్యాడర్ ఏం చేయాలి..? దీనిపై అంతర్గత సందేశాలు అందాయో..లేక రహస్యంగా ఆర్థిక సహకారం అందుతుందో కానీ.. సీమాంధ్రుల పేరుతో.. కొన్ని సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆదివారం కూకట్‌పల్లిలో సీమాంధ్రుల ఐక్యాతసభ పేరుతో ఓ సమావేశం నిర్వహించారు. కొద్ది రోజులుగా.. వాట్సాప్‌లో .. వైసీపీ సానుభూతి పరులందరూ రావాలంటూ.. విపరీతంగా ప్రచారం చేశారు. దానికి తగ్గట్లుగానే.. ఓ వెయ్యి మంది వరకూ… సమావేశం అయ్యారు.
సమావేశం యావత్తూ.. తెలుగుదేశం పార్టీని, మహాకూటమిని తీవ్రంగా విమర్శిస్తూ.. జై జగన్, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. సమావేశంలో టీఆర్ఎస్ను బలపర్చాలని ప్రసంగించిన నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫొటోలను వాడుకుంటోందని.. అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రాహుల్ ప్రచారానికి వస్తామంటున్నారని.. ముందు వైఎస్‌పై వాళ్లిద్దరూ అభిప్రాయం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.
కూకట్‌పల్లిలో వైసీపీ నేతల సమవేశం చర్చనీయాంశమయింది. కులాల వారీగా సీమాంధ్ర ప్రజల్ని విడదీయడానికి.. వేసిన ప్లాన్ గా టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ ఎన్నికలకు దూరమని ప్రకటించిన తర్వాత… తటస్థంగా ఉండొచ్చు కానీ.. ఇలా… తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతుగా సభలు, సమావేశాలు పెట్టడమేమిటన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాల వల్ల తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి లాభం ఉండకపోగా.. సీమాంధ్ర ప్రజల వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని.. ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో.. జగన్ ఇప్పటికైనా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు.. ఆ పార్టీ సీనియర్ నేతలు.