తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ రాజీకయం ఉద్రిక్తంగా మారుతోంది. అక్కడ పరిస్థితి మరీ అంత అనుకూలంగా లేదని.. టీఆర్ఎస్ నేతలకు ముందు నుంచి అనుమానం ఉంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి టీఆర్ఎస్ అక్కడ సీరియస్గా దృష్టి పెట్టింది. పెద్ద సంఖ్యలో.. నేతల్ని మోహరింప చేసింది. టీఆర్ఎస్ అధినేతకు ఆర్థిక, అంగ బలాలున్నాయి. కానీ.. ఒంటేరు మాత్రం… ఒంటరి పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు… తన అనుచరుల్ని పోలీసులు వేధిస్తున్నారని… ఒంటేరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు… ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో.. ఆదివారం సాయంత్రం ఆయన రిటర్నింగ్ ఆధికారి వద్ద.. ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు.
ఆమరణదీక్షకు కూర్చున్న వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు బలవంతంగా తరలించారు. పెనుగులాటలో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ఆయన.. కళ్లు తిరిగి పడిపోయారు. హుటాహుటిన.. ఆయనను హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. వంటేరు ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి అటు గజ్వేల్ లో… ఇటు ఆస్పత్రి వద్ద కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజాకూటమి నేతలు.. వంటేరుపై పోలీసుల ప్రతాపాన్ని ఖండించారు. టీఆర్ఎస్ నేతలే పోలీసులతో కుమ్మక్కై తమ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ప్రజాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
గజ్వేల్ విషయంలో ఈ సారి కేసీఆర్ ను ఓడించి తీరుతానని.. వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. గజ్వేల్ లో ఆయన పదేళ్ల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా.. ఆయన పేరు పెట్టి పిలిచే అనుచరగణం ఉంది. గత ఎన్నికల్లో గజ్వేల్ కేసీఆర్ కాకపోతే.. మరో అభ్యర్థి అయితే.. ఆయన గెలిచేవారని .. టీఆర్ఎస్ నేతలే చెబుతూ ఉంటారు. ఈ సారి కేసీఆర్ అయినా ఓడించి తీరుతానని.. ఆయన సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో… సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఆయనకు అంత ధనబలం లేదు. టీఆర్ఎస్ తరపున పంచే డబ్బులు, మద్యాన్ని నిలుపగలితే.. తనకు సక్సెస్ వచ్చినట్లేననుకుంటున్నారు. దాని కోసం.. ఎన్నికల అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినా సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ అసంతృప్తినే గట్టిగా వెళ్లగక్కి ఆస్పత్రి పాలయ్యారు.