భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యల కంటే ముందుగా… ఓ విషయం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆయన హిందీలో మాట్లాడితే… పక్కనే ఉన్న వెంకయ్య నాయుడు తెలుగులో అనువదించి మరీ అదే విషయాన్ని చెప్పారు. ఆంధ్రాకి హోదా ఇస్తాం, విభజన తరువాత జరిగిన నష్టాన్ని తగ్గిస్తాం అని పదేపదే భాజపా నేతలు హామీలు ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా అదిగో ఇదిగో ఇచ్చేస్తున్నాం అంటూ కాలయాపన చేశారు. నీతీ ఆయోగ్ దగ్గర బిల్లు ఉందనీ, హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని… ఇలా చాలా సాకులు కేంద్రమంత్రులు చెబుతూ వచ్చారు. చిరాఖరికి వచ్చేసరికి… తూచ్, 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్దందీ అంటూ నాలిక మడతేసేశారు. వాస్తవానికి ఆర్థిక సంఘం అలాంటి సిఫార్సులు చెయ్యలేదని సాక్షాత్తూ ఆ సంఘ సభ్యులే చెప్పిన పరిస్థితి.
ఇక, జీవీఎల్ వ్యాఖ్యల విషయానికొస్తే… ఇంత జరిగన తరువాత కూడా ప్రత్యేక హోదా అంటే ఏమిటి అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారాయన! హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దాన్ని ఎలా ఇస్తారు అనేది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ మోసపూరితమైందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చెయ్యాలంటూ 2013లోనే రఘు రామరాజన్ కమిటీ నివేదిక ఇచ్చిందనీ, ఇప్పుడు దాన్ని మళ్లీ తెరమీదికి తేవడం ఏంటని జీవీఎల్ ప్రశ్న వేశారు!
జీవీఎల్ చెప్పిన ప్రకారమే… 2013లోనే దీన్ని నిర్వీర్యం చేయాలని కమిటీ నివేదిక ఇస్తే, ఏడాది తరువాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రాకి హోదా ఇస్తామని మోడీ ఎలా వాగ్దానం చేసినట్టు..? మరి అప్పుడీ నివేదిక ఏమైంది..? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హోదా ఇస్తుందా ఇవ్వదా అనేది వేరే చర్చ. కానీ, ఆంధ్రాకు హోదా ఇస్తామన్న హామీతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి… ఈ నాలుగున్నరేళ్లూ దానిపై తాత్సారం చేయడాన్ని జీవీఎల్ ఎలా సమర్థించుకుంటారు..? అంటే, హోదా అనేది ఇవ్వడం సాధ్యం కాదని తెలిసినా కూడా గత ఎన్నికల్లో మోడీ హామీ ఇచ్చినట్టా..? ఈ లెక్కన, గత ఎన్నికల్లో తాము మోసపూరితమైన హామీ ఇచ్చామని జీవీఎల్ ఇవాళ్ల ఒప్పుకున్నట్టుగా అనిపించడం లేదా..? ఆంధ్రా సమస్యలపై స్పందించే అవకాశం ఇప్పటికీ భాజపాకి ఉంది. కానీ, ఆ దిశగా ఆలోచించకుండా.. ఇతర పార్టీలు ఇస్తున్న హామీలను జీవీఎల్ లాంటి వాళ్ల ద్వారా తప్పు పట్టించడమంటే… దీన్ని రాజకీయం కాకపోతే ఇంకేమనాలి?