సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తా పార్టీతో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. నేను ఎవరో వదిలిన బాణం కాదు…నేనే బాణాలు వదలబోతున్నానని కాన్ఫిడెన్స్ చూపించారు. లక్ష్మినారాయణతో భారతీయ జనతా పార్టీనే కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపధ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలుచే శారు.ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించామన్నారు. లోక్‌సత్తా పగ్గాలు చేపట్టాలని జయప్రకాశ్‌నారాయణ ఆహ్వానించారని… పార్టీని ముందుండి నడిపించాలని కోరారని.. అందుకే అంగీకరించానన్నారు. పార్టీ బలోపేతానికి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మహిళా సాధికారితే తన విధానమని ప్రకటించారు. నన్ను చాలా మంది పార్టీల్లోకి ఆహ్వానించారు కానీ.. నా విధానాల గురించి ఎవరూ మాట్లాడలేదని అందుకే.. ఎవరి పార్టీలోనూ చేరలేదన్నారు.
లోక్ సత్తాలో చేరిన తర్వాత.. వెంటనే… ఇతర పార్టీలపై విమర్శలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చారు. లోక్ సత్తా పార్టీలో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. లోక్ సత్తా విధానాలు నచ్చి వస్తే ఎవరితోనైనా పనిచేయటానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్న అభిప్రాయాన్ని లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు.
లక్ష్మినారాయణ పొలిటికల్ అరంగేట్రంపై… ఆయన పదవికి వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఉన్నంత ఆసక్తి ప్రజల్లో లేకుండా పోయిందన్నది రాజకీయవర్గాల్లో ఉన్న అభిప్రాయం ప్రధానమైన రాజకీయ పార్టీల్లో చేరినా.. లేకపోయినా సొంతంగా పార్టీ పెట్టుకున్నా.. ఎంతో కొంత ఎఫెక్ట్ ఉండేదని.. కానీ ఆల్రెడీ.. విఫల ప్రయోగంగా మారన లోక్ సత్తాలో చేరడమే సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్ష్మినారాయణ ఇప్పుడు ఏం చేయాలనుకున్నా.. ఏం చేసినా… లోక్ సత్తా ముద్రతోనే చూస్తారు కానీ.. తను చెప్పుకుంటున్న విధివిధానాలకు ప్రయారిటీ దక్కే అవకాశం లేదంటున్నారు. మరి ఈ సవాల్ ను లక్ష్మినారాయణ ఎలా అధిగమిస్తారో చూడాలి..!