తెలంగాణ రాష్ట్ర సమితికి రోజుకో సీనియర్ లీడర్ గుడ్ బై చెబుతున్నారు. వీరంతా ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరించిన వాళ్లే. టీఆర్ఎస్ బలంగా లేనప్పుడు.. పార్టీ కోసం పని చేసిన వాళ్లే.అయితే వీరంతా.. నేరుగా టీడీపీలో చేరుతూండటమే అసలు విశేషం. పది రోజుల కిందట.. కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ కొలను హన్మంతరెడ్డి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి.. మహాకూటమి అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్న కూన శ్రీశైలంగౌడ్ కు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. గత ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచి 70 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే వివేకానందకు కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. ఇక కూకట్ పల్లి ఇన్చార్జ్ గొట్టిముక్కల పద్మారావు కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఆయన కూడా టీడీపీలో చేరడం ఖాయమయింది.
వీరిద్దరూ… సుదీర్ఘ కాలంగా.. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లే. గొట్టిముక్కల పద్మారావు.. కేసీఆర్ కు సూటిగా తగిలేలా చిన్న లేఖ కూడా రాశారు. ఇప్పుడు.. తాజాగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పని చేసిన బుడాన్ బేగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం .. ఖమ్మం రాబోతున్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం తరపున ఆయన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నేతలు లేని సమయంలో ఆయన పార్టీని నడిపారు. ఇప్పుడు వలస నేతలంతా రావడంతో కేసీఆర్ ఆయనను పక్కన పెట్టేశారు. దీంతో అసంతృప్తికి గురై.. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీ చేతుల్లో కేసీఆర్ బందీగా మారారని బుడానే బేగ్ ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కీలకంగా భావించే ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. బుడాన్ రాజీనామా వార్తలతో కంగుతిన్న గులాబీ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ప్రారంభమైన రాజీనామాల పరంపర అదే పనిగా కొనసాగుతూండటం.. టీఆర్ఎస్ నేతల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. వెళ్లే వాళ్లంతా.. ఉద్యమకాలం నుంచి ఉన్నవాళ్లే కావడంతో.. టీఆర్ఎస్ పై.. తెలంగాణ వాదుల్లో నమ్మకం సడలిపోయేలా చేస్తోంది.