తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అధినేత కేసీఆర్ చేస్తున్న విమర్శలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూనే ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తెలంగాణకు అవసరమా అవసరమా అంటూ ప్రజలను గుచ్చిగుచ్చి అడిగి మరీ సమాధానాలు చెప్పిస్తున్నారు. మహా కూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు నాయుడు చేతిలోకి తెలంగాణ వెళ్లిపోతుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ ప్రచారం చేస్తున్న సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ విమర్శలకు సమాధానం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమిలో భాగంగా టీడీపీకి ఇచ్చిన సీట్లు ఎన్ని, ఆ లెక్కన ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తనకేంటనీ, వంద స్థానాలు గెలవడం ఖాయమని చెప్పిన కేసీఆర్… ఇవాళ్ల ఎందుకు వణుకుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. ‘నువ్వు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడా? నువ్వు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడా? నువ్వు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు చేస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడా?’ అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఇలాంటి వ్యాఖ్యానాలు కేసీఆర్ చేస్తున్నారన్నారు. ‘టీడీపీకి చెందిన ఎల్. రమణ తెలంగాణనా ఆంధ్రానా..? కోదండరామ్ తెలంగాణనా ఆంధ్రానా..? చాడా వెంకటరెడ్డి తెలంగాణనా ఆంధ్రానా..? ఎందుకు మీరీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు’ అంటూ నిలదీశారు. ప్రధాని మోడీని చూస్తే కేసీఆర్ కి లాగులు తడుస్తున్నాయన్నారు. తెలంగాణ బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీని అడగడానికి దమ్ములేదన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ అడగడానికీ దమ్ములేదన్నారు.
తాను అధికారంలోకి వచ్చాకనే తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా చేశానని కేసీఆర్ చెబుతూ ఉండటం దారుణమన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్తగా శంకుస్థాపన చేసి, పని పూర్తి చేసుకున్న విద్యుత్ ప్లాంట్లు ఎన్నో చెప్పాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు జరిగిందనీ, ఈయన ముఖ్యమంత్రి అయ్యాక కేవలం స్విచ్ మాత్రమే ఆన్ చేశారని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణతోపాటు దేశంలో దాదాపు 27 రాష్ట్రాల్లో ఇప్పుడు మిగులు విద్యుత్ ఉంటోందనీ, ఇదంతా మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన కృషికి ఫలితమే తప్ప… కేసీఆర్ ఘనత కాదన్నారు ఉత్తమ్. మొత్తానికి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న విమర్శలకు మంచి కౌంటరే ఇచ్చారని చెప్పుకోవచ్చు.