వివాదం ఎక్కడుంటే అక్కడ రాంగోపాల్ వర్మ ఉంటాడు. లేదంటే…తానున్న చోటికే వివాదాన్ని రప్పించుకుంటాడు. కేవలం కాంట్రవర్సీల ద్వారానే తన సినిమాపై ఫోకస్ పడేలా చేసుకోవడంలో దిట్ట.. రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం తాను కదుపుతున్న తేనెతుట్టె.. `లక్ష్మీస్ ఎన్టీఆర్`. ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాన్ని బయటపెడతా.. అని ఈసినిమా గురించి స్టేట్మెంట్లు ఇస్తూపోతున్నాడు వర్మ. ఎన్టీఆర్ కెరీర్‌లోని ఆఖరి మజిలీ… అంత గొప్పగా ఏం సాగలేదు. లక్ష్మీపార్వతి రాక నుంచి ఎన్టీఆర్ తన కుటుంబానికి దురమయ్యారు. ఆ తరవాతే వెన్నెపోటు రాజకీయాలు మొదలయ్యాయి. ఇదంతా బాలకృష్ణ `ఎన్టీఆర్` బయోపిక్‌లో ఉండవు. దాన్ని వర్మ ఇప్పుడు క్యాష్ చేసుకోబోతున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ రెండు భాగాలతో పాటు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తేనే… ఎన్టీఆర్ జీవితం మొత్తం అర్థం అవుతుంది. ఓ రకంగా.. ఇది వర్మ తెలివైన ఎత్తుగడ.
కాకపోతే.. ఈసినిమా సజావుగా విడుదల అవుతుందా, లేదా? అనే ధర్మసందేహాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` అని పేరు పెట్టాడు కాబట్టి.. లక్ష్మీ పార్వతి అనుమతి తప్పనిసరి. లక్ష్మీపార్వతి కూడా `సినిమా తీసుకో` అనేశారు. కాకపోతే… స్క్రిప్టు ముందే చూపించాలన్నది ఆమె కండీషన్. దాన్ని నేను తుంగలో తొక్కేశా.. అని వర్మ డైరెక్ట్‌గానే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. స్క్రిప్టు చూపించకపోయినా.. విడుదలకు ముందు సినిమా అయినా చూపించాలి కదా? వర్మ మరీ మొండి ఘట్టం. కాబట్టి దానికీ ఒప్పుకోడు. ఈ విషయంలో వర్మకీ, లక్ష్మీపార్వతికీ మధ్య సయోధ్య కుదరడం దాదాపు అసాధ్యం. మరోవైపు ఈ సినిమాని అడ్డుకోవాలని నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నించడం ఖాయం. ఎన్టీఆర్ కథని సినిమాగా తీస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ విషయంలో వర్మ ఇప్పటి వరకూ వాళ్లని సంప్రదించలేదు. లక్ష్మీపార్వతి అనుమతి ఉంటే చాలన్నది వర్మ ధీమా. ప్రస్తుతానికి బాలయ్య కామ్‌గా ఉన్నా, విడుదలకు ముందు మాత్రం ఏదో ఓ మెలిక పెట్టడం ఖామమన్నది ఫిల్మ్ నగర్ సమాచారం. ఎన్టీఆర్ పార్ట్ 1కీ 2కీ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని విడుదల చేయాలన్నది వర్మ ప్రయత్నం. దాన్ని ఎలాగైనా ఆపాలన్నది మరో వర్గం పట్టుదల. మరి ఈ ఇద్దరిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా నలిగిపోతుంది? సెన్సార్ ని దాటుకుని ఎలా రాగలుగుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.