2.ఓ
నాలుగేళ్ల కష్టం
ఆరొందల కోట్ల వ్యయం..
ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టుని శంకర్ ఎలా హ్యాండిల్ చేశాడా? అనిపిస్తుంది. ఈ బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోవడం సాధ్యమా? అనిపిస్తుంది. శంకర్ దర్శకత్వం, రజనీకాంత్ మానియా, పైగా కనీవినీ ఎరుగని సాంకేతికత.. ఇవన్నీ కలిస్తే.. ఆ బడ్జెట్ తిరిగి రాబట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే.. తెరపై ఆ మాయాజాలం వర్కవుట్ అవ్వాలి. శంకర్ చూపించే గ్రాఫిక్కులు అద్భుతహా అనే స్థాయిలో ఉండాలి. ఈ సినిమాకి సెల్లింగ్ పాయింట్ అదే. అయితే.. రజనీ కామెంట్లు చూస్తే.. రోబో 2.ఓలో గ్రాఫిక్కులన్నీ తేలిపోయాయా? ఈ విషయంలో వీఎఫ్ఎక్స్ కంపెనీలు హ్యాండిచ్చాయా? అనే అనుమానం వేస్తోంది.
2.ఓ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా రజనీకాంత్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి వింటే… ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌పై తొలిసారి అనుమానం కలుగుతోంది. ”రోబో కంటే రోబో 2.ఓ ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో చేశాడు శంకర్. విదేశీ సాంకేతిక నిపుణుల నుంచి తనకు కావల్సిన అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. అయితే.. చివర్లో బాగా ఒత్తిడికి గురయ్యాడు. గ్రాఫిక్స్ తనకు కావల్సినట్టు రాకపోవడంతో టెన్షన్ పడ్డాడు” అని బాంబు పేల్చాడు రజనీకాంత్. ఈ సినిమాకి ఆయువుపట్టు, సెల్లింగ్ పాయింట్ గ్రాఫిక్సే. అలాంటి గ్రాఫిక్స్ తేలిపోతే ఎలా?? అది సినిమాపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈసినిమాకి ఇంత ఖర్చు పెట్టడానికి గల కారణం.. గ్రాఫిక్సే. లేటు అవ్వడానికీ కారణం అదే. అలాంటి గ్రాఫిక్స్ విషయంలో శంకర్ అసంతృప్తిగా ఉన్నాడంటే ఏమనుకోవాలి..?
అయితే వీటిపై తన వివరణ ఇవ్వడానికి శంకర్ కూడా ప్రయత్నించాడు. ”ఈ సినిమా ఆలస్యానికి కారణం గ్రాఫిక్స్. మాకు ఓ వీఎఫ్ ఎక్స్ సంస్థ నుంచి గ్రాఫిక్స్ రావాల్సివుంది. వాళ్లు విడుదల తేదీ దగ్గర పడినా అవుట్ పుట్ ఇవ్వలేదు. మరింత సమయం కావాలన్నారు. మాకు కావల్సిన స్థాయిలో గ్రాఫిక్స్ చేసే సత్తా ఆ సంస్థకు లేదని తరవాత తెలిసింది. దాంతో మరో కంపెనీని సంప్రదించాం. అందుకే ఈ సినిమా ఆలస్యం అయ్యింది. బడ్జెట్ కూడా పెరిగింది” అని క్లారిటీ ఇచ్చాడు శంకర్.
టోటల్‌గా ఈ అభిప్రాయాలు చూస్తుంటే.. 2.ఓలో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. విజువల్ ఎఫెక్స్ సరిగా కుదరకపోతే సినిమా ఫలితంపై అది తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. అయితే శంకర్ దగ్గర ఓ సాకు మాత్రం రెడీగా ఉంది. ”ఓ సంస్థ మాకు హ్యాండిచ్చింది. చివరి నిమిషాల్లో మరొకరికి అప్పగించడం వల్ల క్వాలిటీ దెబ్బతిన్నది” అనొచ్చు. అయితే ఆ అవసరం శంకర్‌కి రాకూడదన్నది కోట్లాది రజనీ
అభిమానుల ఆకాంక్ష.