ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ ఎన్నికలు ముగిశాయి. బుధవారం నాడు మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డిసెంబర్ 11న వెలవడే ఎన్నికల ఫలితాల అనంతరం నరేంద్ర మోడీ అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా మరోసారి రుజువు చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందనీ, అయితే చేసిన మంచి పనులపై మీడియా దృష్టి పెట్టకుండా తమని వ్యతిరేకించడానికే ప్రాధాన్యత ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై కూడా ఉంటుందన్నారు అమిత్ షా. మధ్యప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ… 2014కి ముందు నుంచీ ఆ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అభివృద్ధి మందకొడిగా సాగిందన్నారు. అయితే, 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన దగ్గర్నుంచీ గడచిన ఐదేళ్లలో మధ్యప్రదేశ్ లో అభివృద్ధి అత్యంత వేగవంతంగా జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రభావం ఒకదానిపై ఒకటి ఉంటాయని షా విశ్లేషించారు. ఇక, తెలంగాణ గురించి మాట్లాడుతూ… ఆ రాష్ట్రంలో తెరాసతో రహస్య స్నేహం ఉందన్న ఊహాగానాల్లో వాస్తవం లేదన్నారు. తెరాసతో స్నేహపూర్వక పోటీ లేదనీ, నేరుగానే తెరాసతో తలపడుతున్నామని స్పష్టం చేశారు! సరే, తెరాసతో భాజపాకి ఉన్న సంబంధం ఏంటనేది ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన పనిలేదు.
కేంద్రంతోపాటు రాష్ట్రాల్లో కూడా భాజపా అధికారంలో ఉంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని అమిత్ షా చెప్పడమే విడ్డూరం! అంటే, రాష్ట్రాల్లో భాజపాయేతర పార్టీలు అధికారాల్లో ఉంటే.. అభివృద్ధికి కేంద్రం సహకరించదని అమిత్ షా పరోక్షంగా చెబుతున్నట్టే లెక్క కదా! నిజానికి, 2014 ఎన్నికల తరువాతే రాష్ట్రాల పట్ల కేంద్రంలోని అధికార పార్టీ వివక్ష అనే అంశం తెరమీదికి వచ్చింది. రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత బుద్ధిని భాజపానే పరిచయం చేసింది. వారి రాజకీయ ప్రయోజనాలున్న రాష్ట్రాల పట్ల ఒకలా… లేని రాష్ట్రాల పట్ల మరోలా వ్యవహరించిందే మోడీ సర్కారు! అదే అభివృద్ధికి ఒక రోల్ మోడల్ అన్నట్టుగా అమిత్ షా గొప్పగా చెబుతూ ఉండటం దారుణం.