కేంద్రమంత్రి మండలి సలహా ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడం, దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు దానిని విచారణకు స్వీకరించి కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం వంటి చాలా ఆసక్తికరమయిన పరిణామాల తరువాత ఇప్పుడు మరొక ఆసక్తికరమయిన విషయం బయటపడింది. ఆ రాష్ట్ర గవర్నర్ జె.పి. రాజ్ కోవా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరిస్తూ వ్రాసిన లేఖలోని వివరాలను ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు బయటపెట్టింది. దాని ప్రకారం ఆ రాష్ట్రప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య చాలా కాలంగా తీవ్ర విభేదాలు నెలకొని ఉన్నట్లు స్పష్టమవుతోంది. గవర్నర్ పై ముఖ్యమంత్రి తుకి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుండి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ గవర్నర్ మొత్తం 17 నివేదికలను కేంద్రప్రభుత్వానికి పంపారు.
రాష్ట్రపతి పాలనకు దారి తీసిన ఆ నాలుగు పేజీల లేఖలో సారాంశం ఏమిటంటే ముఖ్యమంత్రి నబం తూకి మరియు కొందరు మంత్రులకి నిషేధిత నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్-ఖప్లాంగ్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే దృవీకరించారు. నైషీ తెగకు చెందిన నబం తూకి ప్రభుత్వంలో చాలా మంది అధికారులు అదే తెగకు చెందినవారున్నారు. గవర్నర్ ఆదేశాలను పాటించవద్దని, ప్రభుత్వ పాలనకు సంబంధించి గవర్నర్ కి ఎటువంటి నివేదికలు పంపవద్దని వారిని ముఖ్యమంత్రి నబం తుకి ఆదేశాలు జారీ చేసారు. వారు అందరూ నైషీ ఎలైట్ సొసైటీ అనే మతతత్వ సంస్థకు మద్దతుదారులు.
డిశంబర్ 15,16,17 నైషీ తెగకు చెందిన కొందరు నేతల సమక్షంలోనే గవర్నర్ పై దాడి జరిగింది. కానీ భద్రతాసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో గవర్నర్ కి ప్రమాదం తప్పింది. డిశంబర్ 17వ తేదీనే ముఖ్యమంత్రి నబం తుకి మరియు స్పీకర్ నబం రెబియ నేతృత్వంలో నైషీ సంస్థకు చెందిన కొందరు రాజ్ భవన్ గేటు ముందు ఒక ఆవును బలి ఇచ్చేరు. తుకి ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న అస్సాం ప్రజలకు వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలను రెచ్చ గొడుతోంది. తత్ఫలితంగా రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉంది.
తుకి అనుసరిస్తున్న వైఖరి కారణంగా ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణ కొరవడింది. ముఖ్యమంత్రి తుకి వైఖరి కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి. నిజానికి చాలా రోజులుగా తుకి మైనార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు తుకి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించేరు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థుతుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించడం అన్ని విధాల మంచిదని గవర్నర్ జె.పి. రాజ్ కోవా రాష్ట్రపతికి లేఖలో తెలియజేసారు. ఆయన లేఖ ఆధారంగా కేంద్రమంత్రి వర్గం సిఫార్సుతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
ఈ పరిస్థితి ఏర్పడటానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి మాత్రమే పైకి కనిపిస్తోంది. అదేమిటంటే గవర్నర్ రాజ్ కోవాకి, ముఖ్యమంత్రి తుకి మధ్య విభేదాలు. కేంద్రప్రభుత్వం సూచనలను పాటిస్తూ గవర్నర్ తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు పావులు కదుపుతున్నరనే కోపంతోనే బహుశః తుకి ఆవిధంగా వ్యవహరించారేమో? ఇక పైకి కనబడనివి ఏమిటంటే గవర్నర్ తన లేఖలో ముఖ్యమంత్రిపై చేసిన అభియోగాలు, అలాగే తుకి ప్రభుత్వాన్ని గవర్నర్ పడగొట్టే ప్రయత్నాలు. కారణాలు ఎవయినప్పటికీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది.