జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతులతో సమవేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో.. రైతులతో సమవేశమై.. తాను కోనుగోలు చేసిన పుస్తకాల్లో చదివి గ్రహించిన జ్ఞపకాల నుంచి కొన్ని గుళికలను.. రైతులకు ప్రసాదింప చేశారు. పవన్‌కల్యాణ్ ది సహజంగా.. వామపక్ష భావజాలం కాబట్టి.. ఎర్ర అట్ట ఉండే పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. అలాంటి పుస్తకాల్లో చాలా చోట్ల బూర్జువా ప్రభుత్వాల గురించి.. ప్రపంచీకరణ గురించి.. ప్రపంచీకరణ వల్ల రైతులు ఎలా సాగుకు దూరమవుతున్నారనే అంశాలపై విస్తృతంగా తెలుసుకున్నారు.
ప్రపంచీకరణ వల్ల సాగు విధ్వంసమంటే ఏమిటో..?
చదవేస్తే వచ్చిన జ్ఞానాన్నంతా.. పవన్ కల్యాణ్ అమలాపురంలో రైతులకు అప్పజెప్పారు. ప్రపంచీకరణ పేరుతో వ్యవసాయ రంగంలో విధ్వంసం జరుగుతోందన్నారు. బహుశా పవన్ కల్యాణ్ ఉద్దేశంలో.. చైనా నుంచి వచ్చిన వరికోత యంత్రాలతో.. విరివిగా.. కోసేస్తున్న పంటను..విధ్వంసం అనుకుని ఉంటారు. ప్రపంచీకరణ వల్లే ఆ యంత్రం అమలాపురం వరకూ వచ్చింది. అదే లేకపోతే.. ఇప్పటికీ.. సినిమాల్లో చూపించినట్లుగా.. ఆడుతూ.. పాడుతూ పని చేస్తూ ఉంటే.. అని పాడుకుంటూ… రైతు కూలీలు.. కోసుకుంటూ ఉండేవారు. అప్పుడు విధ్వంసం ఉండేది కాదు. అంతేనా… సెజ్ పేరుతో వైఎస్ హయాంలో రైతుల భూములు కాజేశారని తీర్పిచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపారని గుర్తు చేశారు.
రెండు సెంట్లలో వరి పండించిన రైతు ఎవరైనా ఉంటారా.. ఒక్క పవన్ తప్ప..!
ఈ క్రమంలో… తనకు మట్టి శక్తి నాకు తెలుసని చెప్పారు. ఎలా తెలుసు..అని అప్పటికప్పుడు పవన్ కల్యాణ్ తనను తాను ప్రశ్నించుకుని… తన ఫార్మ్ హౌస్‌లో సాగు చేసిన పంట గురించి చెప్పుకొచ్చారు. తన ఫార్మ్‌హౌస్‌లో మాగాణి ఉందో లేదో కానీ.. అలాంటి దానితో పని లేకుండానే… వరి సాగు చేశారు. అదీ కూడా… ఆషామాషీగా కాదు.. చాలా భారీ ఎత్తున. 2సెంట్ల పొలంలో వరి పండించారట. అప్పుడే.. రైతుల కష్టాలు తెలిశాయట. మరి ఆదర్శ రైతు అవార్డు వచ్చిందో రాలేదో మరి. రాకపోతే… ఇప్పటికైనా తన గొప్పతనాన్ని ప్రభుత్వానికి తెలియజేయగలిగితే..ఇచ్చే అవకాశం ఉంది.
కోనసీమ పచ్చదనం వల్లే ఏపీ విభజన జరిగిందా..?
ఇదే కాకుండా.. ఇప్పటివరకూ.. రాష్ట్ర విభజనకు అనేక కారణాలను అందరూ .. విశ్లేషించి ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ ఆలోచన మాత్రం వేరే ఉంది. అసలు.. విబజన కారణం..కోనసిమ పచ్చదనమట. అందరి కళ్ళు పడిన ఈ కోనసీమ పచ్చదనమే విభజనకు కారణం అయ్యింది. ఇది పవన్ కల్యాణ్ చదివిన ఏ పుస్తకంలో ఉందో కానీ.. దీనిపై… ఎవరైనా పీహెచ్డీ చేసి థీసిస్ సమర్పించవచ్చు.”కోససిన పచ్చదనం వల్లే సమైక్యాంధ్ర విభజన.. ” డిస్కవర్డ్ బై పవన్ కల్యాణ్.. అని హైలెట్ చేయవచ్చుకూడా. జనవరి లో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలోని రైతు సమస్యలపై జిల్లాల వారి సదస్సులు పెడతామని భరోసా కూడా ఇచ్చారు. కోనసీమ గ్యాస్ గురించి..మరో అంశం గురించి..చాలా సేపు మాట్లాడారు కానీ.. .. అన్నీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన గుళికలే. కానీ.. ఇప్పటికీ.. ఆదర్శ రైతుతో ముగిస్తే ..బెటరేమో..?
— సుభాష్