కొద్ది రోజుల క్రితం.. కల్వకుంట్ల తారక రామారావు కొడంగల్ వెళ్లారు. ప్రచారం చేశారు. ప్రచారం సందడిలో సన్యాసం సవాల్ చేశారు. అది అయిపోయిన తర్వాత.. ప్రజలకు ఓ వరం ఇచ్చేశారు. అదేమిటంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. తాను కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్నారు. ఆ ఆఫర్ విని టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరపడ్డారేమోకానీ.. రేవంత్ అనుచరుల నుంచి చాలా సెటైర్లు వచ్చి పడ్డాయి. కేటీఆర్ దత్తత తీసుకుంటే ఇసుక వ్యాపారం చేస్తారా.. అని దగ్గర్నుంచి ప్రారంభమై.. రేవంత్ గెలిస్తే.. కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని దత్త తీసుకుంటారనే వరకూ.. చాలా వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపించాయి. నిన్న సిరిసిల్లలో… సీరియస్‌గానే… రేవంత్ .. దత్తతపై కామెంట్ చేశారు. ఈ రిప్లయ్‌ని కేటీఆర్ కూడా ఊహించి ఉండరు.
తన ప్రచారంలో భాగంగా… సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి.. అక్కడ ప్రచారం నిర్వహించారు. తాను సిరిసిల్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ పని తీరుపై.. తనదైన మార్క్‌లో సిరిసిల్ల ప్రజల ముందు పంచ్లువేశారు. తండ్రీ కొడుకులిద్దరూ కూతలొళ్లు, కూతల పోటీ పెడితే..గెలుస్తారో చెప్పలేమని సెటైర్ వేశారు. ఎన్ని అవకాశాలిచ్చినా కేటీఆర్ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. స్థానికుడే ఇక్కడి నాయకుడ్నే ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు., టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే అమెరికా వెళ్లే కేటీఆర్‌కు ఓటు వేస్తారా? ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే గిట్టే మహేందర్‌రెడ్డికి ఓటు వేస్తారా?. అని ప్రజలకు చాయిస్ ఇచ్చారు. బతుకమ్మ చీరలు కోసం 250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లతో రెండు వందలకో చీరను సూరత్ నుంచి కొనుక్కొచ్చారని మండిపడ్డారు. వారానికోసారి చేనేత బట్టలు ధరించాలన్న కేటీఆర్ నే ధరించడం లేదని.. చెప్రాసిగా కూడా కేటీఆర్ పనికి రారు తేల్చారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసే బాధ్యతల్ని తీసుకోగలిగిన రేవంత్ రెడ్డి.. కొన్ని కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. కేకే మహేందర్ రెడ్డి.. ఒకప్పుడు టీఆర్ఎస్లోనే పని చేసేవారు. కానీ కేసీఆర్ ఆయనను తప్పించి.. 2009లో తన కుమారుడు.. కేటీఆర్‌కు టిక్కెట్ ఇచ్చారు. తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్ రెడ్డికి… ప్రజల నుంచి ఆదరణ వచ్చింది. అయితే కేవలం 171 ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉద్యమం ఊపందుకుంది. ఇప్పుడు..ఉద్యమం సెంటిమెంట్ లేదు. కానీ.. సిరిసిల్లలో ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. కేటీఆర్ పై అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తికి తోడు.. మహేందర్ రెడ్డిపై సానుభూతి ఉంటుందని.. రేవంత్.. ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి కేటీఆర్ కు షాకిస్తే.. అది రేవంత్ కే అడ్వాంటే అవుతుంది.