నరేంద్రమోదీ నేడు నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభల్లో ఆయన ఏం ప్రసంగిస్తారన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నేరుగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేయలేరు. పాలన బాగా లేదని.. అవినీతి జరిగిందని.. విమర్శించలేని పరిస్థితి ప్రధాని మోదీది. దీన్ని ఆయనే తెచ్చుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై… పార్లమెంట్ లో జరిగిన చర్చలో… తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను… మెచ్చుకున్నారు మోదీ. ఏపీ సీఎం చంద్రబాబును తక్కువ చేయడానికి.. ఆయన కేసీఆర్ ను పొగిడారు ఈ పొగడ్తల్ని .. కేసీఆర్, కేటీఆర్.. తమ ఎన్నికల ప్రచారంలో పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. తమది ప్రధాని మోదీ కూడా పొగిడిన గొప్ప పాలన అంటున్నారు.
ఇలాంటి సమయంలో మోదీ.. టీఆర్ఎస్ పాలనను విమర్శిస్తే.. అది ఆయనకే మైనస్ అవుతుంది. ఓ విధంగా పార్లమెంట్ లో టీఆర్ఎస్ పై పొగడ్తలతో.. బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఎజెండా లేకుండా చేశారు మోదీ. ఇప్పుడు కుటుంబపాలన అంటూ.. ఓ మాట అనడం తప్ప.. అంతకు మించి విమర్శలు చేయలేని పరిస్థితి ఉంది. కానీ.. ఆయన తన వాక్చాతుర్యాన్ని ప్రజాకూటమిపై చూపించే అవకాశం ఉంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులను కార్నర్ చేయవచ్చు. కానీ.. టీఆర్ఎస్ ను పైపైన విమర్శించి.. పూర్తిగా… మహాకూటమిని విమర్శిస్తే.. అది బీజేపీకే కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందికరంగా మారనుంది. ఇరువురి మధ్య లోపాయికారీ ఒప్పందానికి అంత కన్నా సాక్ష్యం ఏం కావాలన్న విమర్శలు రెడీగా ఉంటాయి.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పరిస్థితిని ముందుగానే ఊహించారు. మోడీతో ఏం సంబంధంలేదని చెప్పుకునేందుకు తరచూ విమర్శలు చేస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మోదీని విమర్శిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ల ఇవ్వబోమంటున్న బీజేపీని పడగొట్టాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటి వరకూ.. కేసీఆర్ తెలంగాణలో ప్రచారంలో చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. మోదీ ప్రచారం చేసి వెళ్లిన తర్వాత.. ఇక .. బీజేపీపైనా..అదే స్థాయిలో విరుచుకుపడాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఉంటుంది. లేకపోతే కుమ్మక్కయ్యారని.. ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది.