రజనీకాంత్, అక్షయ్‌కుమార్, శంకర్ హైదరాబాద్ వచ్చారు. ‘2.ఓ’ కోసం ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో కొత్త విషయాలు ఏమైనా వున్నాయా? అని వెతుక్కుంటే ఒక్కటి కనిపించదు. ఇంతకు ముందు చెన్నై ఆడియోలో, ముంబై ప్రెస్మీట్లో చెప్పిన విషయాలను మరోసారి చెప్పారు. మీడియాతో ముఖాముఖీ ప్రశ్నలకూ ముక్తసరి సమాధానాలు ఇచ్చారు. గంటసేపు వున్నారో? లేదో? వెంటనే రజనీ, అక్షయ్ వెళ్లిపోయారు. తరవాత కొన్ని టీవీ ఛానళ్లకు శంకర్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈమాత్రం దానికి ప్రెస్‌మీట్ ఎందుకు? రజనీ, అక్షయ్ రావడం ఎందుకు? అని ప్రశ్నించుకుంటే… తెలుగులో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ బలవంతం మీద వచ్చినట్టు తెలిసింది. ప్రెస్మీట్లో ఆయన మాటలు గమనిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టాలని గంట ముందు చెబితే ఛార్టెడ్ ఫ్లైట్స్‌లో రజనీ, అక్షయ్ వచ్చారని, తమ షెడ్యూల్స్ మార్చుకున్నారని ఎన్వీ ప్రసాద్ చెప్పారు. అసలు రజనీకాంత్‌కి అయితే హైదరాబాద్ రావడం ఇష్టం లేదో? లేదంటే సినిమాపై అతి నమ్మకమో? “ఈ సినిమాకు ప్రచారం అవసరం లేదు. నిర్మాత ప్రసాద్ గారు డబ్బు వృధా చేస్తున్నారు. ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు” అని రజనీ తన స్పీచులో పేర్కొన్నారు. తెలుగు అంటే తమకు చిన్న చూపు లేదని చెప్పడానికి అన్నట్టు హైదరాబాద్‌లో ఒక ప్రెస్‌మీట్ పెట్టి మమ అనిపించుకున్నారు.