ప్రతిపక్ష జగన్ పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. దీనికి సంబంధించి సాక్షి పత్రిక ఇస్తున్న కవరేజ్ కేవలం రెండు అంటే రకాలుగా మాత్రమే ఉంటోంది! జగన్ సభ పెడితే… ఆయన చేసే విమర్శల్ని పతాక శీర్షికగా వేయడం. లేదంటే, ప్రజల స్పందన అనే యాంగిల్ తీసుకుని… ఫలానాది కోరుకుంటున్నారంటూ ఆ కోణంలో కథనాలు రాయడం! ఇవాళ్టి (27వ తేదీ) సాక్షి పత్రికలో రెండో తరహా కథనం మరోసారి ప్రచురించారు. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ సమీపంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కొంతమంది అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తూ మోసపోతున్నామని వారు పోయారని కథనంలో పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తి హాయ్ లాండ్ ను తన కుమారుడు నారా లోకేష్ కు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని బాధితుల వాయిస్ గా రాశారు. ఇది చాలా అన్యాయమనీ, తమ డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే తీవ్ర ఆందోళనలో ఉన్నామంటూ బాధితులు జగన్ తో చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుపై పూర్తిగా నమ్మకం పోయిందనీ, నువ్వు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు న్యాయం జరగదని జగన్ ముందు వాపోయినట్టు రాశారు. ఈ మొత్తం కథనానికి ‘చంద్రబాబుపై నమ్మకం పోయిందన్నా’ అంటూ శీర్షిక పెట్టారు.
అగ్రిగోల్డ్ వివాదాన్ని పూర్తి రాజకీయాంశంగా సాక్షి చూస్తోందనడానికి ఇది మరో సాక్ష్యం. కొద్ది రోజుల కిందటే… హాయ్ లాండ్ తమది కాదంటూ అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, ఆ వెంటనే అది తమదే అనే విషయాన్ని కోర్టులో కూడా చెప్పామని అగ్రిగోల్డ్ ఎండీ ప్రకటించారు. ఈ సమాచారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిపాజిటర్లలో ఆందోళన సృష్టించే కథనాలకే సాక్షి ప్రాధాన్యత ఇచ్చింది. నేటి కథనం కూడా దాదాపు అలాంటిదే.
అగ్రిగోల్డ్ ఆస్తుల్ని లోకేష్ కి కట్టబెట్టాలని చంద్రబాబు ఎలా అనుకుంటారు..? ప్రాక్టికల్ గా అదెలా సాధ్యం..? అమ్మకం ప్రక్రియ అంతా కోర్టు ద్వారా జరుగుతుంది కదా! ఇంతకీ, కోర్టులో ఉన్న ఆస్తుల్ని ఎవరైనా తమ పేరున, లేదా వారసుల పేరున ఎలా రిజిస్టేషన్ చేసుకోగలరు..? ఈ సాధారణ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ‘జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగదు’ అనేది వైకాపా రాజకీయ లబ్ధి కోసం రాసుకున్న కామెంట్. దాన్ని ప్రజాభిప్రాయానికి అన్వయించే ప్రయత్నం సాక్షి చేస్తోంది. వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు, దీనిపై జగన్ అయినా భిన్నంగా ఏం చెయ్యగలరు..? అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులు జరపాలంటే, ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల్ని అమ్మి న్యాయం చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ కూడా ఆ దిశలోనే ఉంది. దీనికంటే కొత్తగా జగన్ ఎలాంటి న్యాయం చేస్తారు..? నిజానికి, అగ్రిగోల్డ్ వివాదాన్ని తమ రాజకీయ ప్రయోజనాల అంశంగా వైకాపా మార్చుకున్న దగ్గర్నుంచే సమస్య పెద్దది అయిందనొచ్చు. కొనడానికి కంపెనీలు ముందుకొస్తే… టీడీపీ సర్కారు ఏదో కుట్ర చేసేస్తోందని కథనాలు రాసి, వారిలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తారు. ఇప్పుడేమో బాధితులను భయభ్రాంతులను గురి చేసే కథనాలు రాస్తున్నారు.