నాకో తిక్కుంది… దానికో లెక్కుంది అంటుంటాడు పవన్ కల్యాణ్. తన మాటల్లో ఆ తిక్క స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటాడు పవన్. నిన్న చెప్పిన దానికీ, ఈరోజు చెప్పిన దానికీ ఎలాంటి పొంతన ఉండదు. రాజకీయాల్లో ఇలాంటి మాటలు కామనేనేమో. సినిమాల విషయంలోనూ ఇలానే మాట్లాడితే ఇబ్బంది.
`నేను ప్రజా సేవ కోసమే సినిమాలు మానేశా` అని పదే పదే చెబుతుంటాడు పవన్. అయితే పవన్ కోసం ఇప్పటికీ నిర్మాతలు క్యూలో ఉన్నారు. వాళ్లతో సినిమా చేస్తానని చెప్పి – అంతలోనే మాట మార్చేస్తున్నాడు పవన్. మొన్నామధ్య పవన్ – డాలీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని వార్తలొచ్చాయి. వాటిపై సీరియస్గా ఖండించాడు పవన్. `నా దృష్టి పూర్తిగా సినిమాలపైనే` అని తేల్చేశాడు. ఇంతలోనే మాట మార్చేశాడు వవన్. పవన్ ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజా పోరాట యాత్ర పేరుతో పర్యటిస్తున్నాడు. అక్కడ కొంతమంది పాత్రికేయులతో మాట్లాడుతూ సినిమాల టాపిక్ ఎత్తాడు.
తన దగ్గరకు కొంతమంది నిర్మాతలు వచ్చి, సినిమాలు చేయమని అడుగుతున్నారని, రాజకీయాల్లో నిధులు అవసరం కాబట్టి, వాటి కోసమైనా సినిమాలు చేయమని సన్నిహితులు సలహా ఇస్తున్నారని, ఆ విషయమై తాను ఆలోచిస్తున్నానని చెప్పాడు పవన్. అంటే.. పవన్ మనసులో సినిమాలు చేయాలన్న కోరిక బలంగా ఉన్నట్టే. డబ్బుల కోసమా? లేదంటే.. నిర్మాతలకు ఇచ్చిన మాట కోసమా? అనేది పక్కన పెడితే.. పవన్ సినిమాల చేసే అవకాశాన్ని ఏమాత్రం కొట్టి పారేయలేం. అలాంటప్పుడు `నేను సినిమాలు చేయను.. ఆ ఉద్దేశ్యమే లేదు` అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా శాశ్వతం కాకపోవొచ్చు. ఎందుకంటే పవన్ ఈ స్టేట్మెంట్పై మరో స్టేట్మెంట్ ఇవ్వడానికీ వెనుకంజ వేయడు. ఎందుకంటే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి ఎరుక??