‘అర్జున్‌రెడ్డి’తో విజయ్ దేవరకొండకు స్టార్డమ్ రాకపోతే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాను చేసేవాడేమో! ఓ విధంగా ‘అర్జున్‌రెడ్డి’ విజయం కొన్ని కథల్ని హీరో దగ్గరకు వెళ్లకుండా చేసింది. కొన్ని కథల్ని అతను వద్దనుకున్నాడు. ఎలాగంటే… ‘పెళ్లి చూపులు’ విడుదలకు ముందే విజయ్ దేవరకొండకు ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పాడు. కథ నచ్చిందనీ, కొన్ని రోజుల తర్వాత చేద్దామనీ విజయ్ దేవరకొండ అన్నాడు. ఈ లోపు ‘అర్జున్‌రెడ్డి’ రావడంతో అతడికి స్టార్డమ్ వచ్చింది. తన కథకు కొత్త హీరో కావాలని కార్తికేయను తీసుకున్నారు అజయ్ భూపతి. అలా విజయ్ వదిలేసిన కథ ‘ఆర్ఎక్స్ 100’ సంచలన విజయం సాధించింది. త్వరలో రాబోతున్న ‘హుషారు’ కూడా విజయ్ దేవరకొండ వదిలేసిన కథే. దాదాపుగా కొత్త నటీనటులతో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. దర్శకుడిగా అతనికి ఇదే తొలి సినిమా. ఈ హైదరాబాదీ కుర్రాడు ‘హుషారు’ కథతో తొలుత విజయ్ దేవరకొండను కలిశాడు. తాజా ఇంటర్వ్యూలో శ్రీహర్ష మాట్లాడుతూ ‘‘విజయ్ దేవరకొండకు కథ చెప్పా. తనకు బాగా నచ్చిందని చెప్పాడు. కథ గురించీ, సినిమా గురించీ అతడికి పూర్తిగా తెలుసు. నలుగురు హీరోలు వుండటం వల్ల చేయలేదు. సోలో హీరో కథ వుంటే చెప్పమన్నాడు’’ అని అన్నాడు. ‘ఆర్ఎక్స్ 100’లా ఈ ‘హుషారు’ కూడా హిట్టయితే… తరవాత విజయ్ దేవరకొండ శ్రీహర్ష కొనుగంటి సినిమా చేసే అవకాశం ఉంటుంది.