హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కి భలే క్రేజ్ వచ్చేసింది. తెలుగులో రూపుదిద్దుకున్న యాక్షన్ చిత్రాలకు హిందీ శాటిలైట్ రూపంలో మంచి రేట్లు గిట్టుబాటు అవుతున్నాయి. కొన్ని సినిమాలకైతే ఊహించని రేట్లు దక్కుతున్నాయి. తాజాగా అల్లు శిరీష్ నటించిన `ఏబీసీడీ` చిత్రానికి హిందీ డిజిటల్, శాటిలైట్ రూపంలో రూ.2.5 కోట్లు వచ్చాయట. ఈ విషయాన్ని చిత్రబృందమే ప్రకటించింది. డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేయడంలో అగ్రగామి సంస్థ అయిన గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుంది. విడుదలకు ముందే.. హిందీ శాటిలైట్ అమ్ముడుపోవడం మంచి విషయమే. అదీనూ శిరీష్ సినిమాకి. కాకపోతే.. రూ.2.5 కోట్లన్నదే నమ్మశక్యం కాని విషయం. శిరీష్ సినిమాలకు తెలుగులోనే మార్కెట్ లేకుండా పోయింది. ఇక హిందీలో ఎవరు చూస్తారు? పైగా ఇదేం యాక్షన్ సినిమా కాదు. లవ్ స్టోరీలకూ, ఎంటర్టైన్ సినిమాలకూ హిందీ శాటిలైట్ గిరాకీ చాలా తక్కువ. దానికి తోడు శిరీష్‌కి అదిరిపోయే విజయాలు లేవు. హిందీలోనూ అతగాడెవరో తెలీదు. అన్నింటికంటే మించి ఇదో రిమేక్ సినిమా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే.. రూ.2.5 కోట్లన్నది కేవలం ఈ సినిమాకి హైప్ తీసుకురావడానికి చెబుతున్న అంకెలా కనిపిస్తోంది. నిజంగా అంతకు అమ్ముడుపోతే.. శిరీష్ సినిమాలకూ మంచి రోజులు వచ్చినట్టే అనుకోవాలి.