ఈమధ్య సినిమా వాళ్లు కూడా ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకున్నారు. సెలబ్రెటీలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల పని తీరుని విమర్శిస్తే.. అలాంటి ఘటనలన్నీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంటాయి. ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా స్పందించాల్సివస్తుంది. అందుకే సెలబ్రెటీల మాటకు అంత డిమాండ్. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… ప్రస్తుతం మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా కేటీఆర్కీ ఓ సూటి ప్రశ్న సంధించారు. ఎప్పుడూ తన సినిమాలు, తన గొడవలతో మౌనంగా ఉండే అశ్విన్.. ఇప్పుడు ఈ తరహాలో గళం విప్పడం తన ఆవేదక వ్యక్తం చేయడం.. ఆశ్చర్యపరుస్తోంది.
ఆ ఆదివారం నాగ్ అశ్విన్ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దాంతో సకాలంలో వైద్యం అందక చనిపోయాడు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టిని ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు అశ్విన్.
‘ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందక ఓ మనిషి చనిపోవడం దారుణం. ఆ సమయంలో మరేదైనా ఆసుపత్రికి తరలించి ఉంటే అతను బతికేవాడే. ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సర్. దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు అశ్విన్. ఈ విషయంపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది. మరి కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.