ఓ వైపు `ఎన్టీఆర్` బయోపిక్ నిండా స్టార్లే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు… చిన్న పాత్రకైనా పెద్ద స్టార్‌ని తీసుకుని దీన్నో మెగా మల్టీస్టారర్ సినిమా చేసేశాడు క్రిష్. మరోవైపు `లక్ష్మీస్ ఎన్టీఆర్` మాత్రం స్టార్లు లేక వెలవెలబోతోంది. నిజానికి `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. వర్మ తనకున్న తెలివితేటల్ని ఉపయోగించాలే గానీ… ఈసినిమాకి బ్రహ్మాండమైన హైప్ క్రియేట్ చేయగలడు. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని వర్మ ఎలా చూపించాడు? అని తెలుసుకోవడానికైనా ఈ సినిమాని నందమూరి ఫ్యాన్స్ చూడడం ఖాయం. ఇలాంటి కమర్షియాలిటీ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుని వర్మ చాలాకాలం అయ్యింది. అందుకే వర్మ ఈసారి స్టార్స్‌తో ప్రొసీడ్ అవుతారనుకున్నారంతా. కనీసం ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రల కోసమైనా పేరున్న నటీనటుల్ని సంప్రదిస్తాడని అనుకున్నారు. ఓ దశలో టబు లాంటి పేర్లు వినిపించాయి. నిజానికి ఈ పాత్రలు స్టార్స్‌ని డిమాండ్ చేస్తాయి కూడా.
కానీ వర్మ మాత్రం `నాకు స్టార్స్‌తో పనిలేదు` అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి కొత్తవాళ్లపైనే ఆధారపడుతున్నాడు. తన సాంకేతిక నిపుణుల్లోనూ పేరున్నవాళ్లెవ్వరూ లేరు. వర్మ వాలకం చూస్తుంటే మరోసారి చుట్టుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడనిపిస్తోంది. వర్మ గొప్ప టెక్నీషియన్. అది కాదనలేని సత్యం. కాకపోతే ఈమధ్య అతని సినిమాల్లో క్వాలిటీ లోపించింది. ఆఖరికి ఈమధ్య వచ్చిన ఆఫీసర్‌తో సహా. ఎంతసేపూ తక్కువలో తీసి, ఎక్కువ రేటుకి అమ్ముకుని, నాలుగు డబ్బులు చేసుకుందామని చూడడం తప్ప.. సినిమాలో క్వాలిటీకి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మరోసారి వర్మ తన పంథాలోనే వెళ్లిపోతున్నాడు. వర్మకి వరుస ఫ్లాపులున్నాయి. తనపై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. అయినప్పటికీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునే ఛాన్సొచ్చింది. కానీ దాన్ని కూడా చేచేతులా పాడు చేసుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఎన్టీఆర్ కూడా వర్మని గట్టెక్కించకపోతే… వర్మ దుకాణం సర్దేసే రోజులు ఎంతో దూరంలో లేనట్టే.