ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుజనా చౌదరి ఇంటిపైన, సంస్థలపైన దాడులు చేసి, దాదాపు 5700 కోట్ల రూపాయలకు చౌదరి మరియు అతని కంపెనీలు బ్యాంకు లకి టోపీ పెట్టాయని ఆరోపించిన విషయం తెలిసిందే. విజయ మాల్యా బ్యాంకులకు శఠగోపం పెట్టిన మొత్తానికి సమానం కాకపోయినా దాదాపు అంత పెద్ద స్థాయి ఆరోపణలు కావడంతో సుజనా చౌదరి ని ఆంధ్ర మాల్యా అని పేర్కొంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ రోజు ముమ్మిడివరంలో ప్రజా పోరాటం సాగించిన పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి పై ఘాటు విమర్శలు చేశారు.
సుజనా చౌదరి చేసిన మోసం విలువ దాదాపు 5700 కోట్లు అని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పిన పవన్ కళ్యాణ్, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలు చేసే టాటా, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని, సుజనా చౌదరి తన సంస్థలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. ఎవరికి ఉద్యోగాలు కల్పించకుండా, షెల్ కంపెనీలు పెట్టి వేలాది కోట్లు సంపాదించిన సుజనా చౌదరి లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రత్యేక హోదా పోరాటం సందర్భంగా కూడా సుజనా చౌదరి, పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. “జల్లికట్టు ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటే పందుల పోటీలు పెట్టుకోవాలి తప్పించి ఇలా ప్రత్యేక హోదా అంటూ ఉద్యమం చేయకూడదు” అంటూ గతంలో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ సందర్భంలో కూడా సుజనా చౌదరి పై పవన్ కళ్యాణ్ “యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి గారు పందుల పందాల తో పోల్చడం బాధాకరం ఇలాంటి కామెంట్ చేసే వారిని ఏపీ ప్రజలు విద్యార్థులు గుర్తు పెట్టుకుంటారు” అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం తెలిసిందే. అప్పుడు దానికి స్పందించిన సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ వి అపరిపక్వమైన వ్యాఖ్యలు అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా చేసిన విమర్శలపై సుజనా చౌదరి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.