తెలంగాణ ఎన్నికల పర్వం లో, మహా కూటమి ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతోంది. ప్రత్యేకించి మహాకూటమిలోని భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి తారల అండదండలు లభిస్తున్నాయి. ఒకపక్క కూకట్పల్లిలో పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మద్దతుగా సోదరుడు తారకరత్న ప్రచారంలోకి దిగితే, మరోపక్క హీరో వేణు తొట్టెంపూడి, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇటీవల కూకట్పల్లిలో తన అక్క కోసం ప్రచారానికి శ్రీకారం చుట్టిన నందమూరి తారకరత్న, తమ తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ లో తెలంగాణకు ఎంతగానో సేవ చేశారని, ఆ కుటుంబం నుంచి వస్తున్న ఆడపడుచు అయిన నందమూరి సుహాసిని ని మీ ఇంటి ఆడపడుచు గా భావించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే కూకట్పల్లి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇక స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలతో ఒకప్పుడు తారాపథంలో దూసుకెళ్లి ఆ తర్వాత సరైన విజయాలు లేక వెనుకబడిపోయిన హీరో వేణు తొట్టెంపూడి సడన్గా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ కనిపించి ప్రజలకు షాక్ ఇచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నామా నాగేశ్వరరావుకు వేణు తొట్టెంపూడి బంధువు అవుతారు. ఈయనకు నాగేశ్వరరావు వరుసకు బావ కావడంతో, ఆయన తరపున ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న హీరో వేణు మా బావను గెలిపించండి అంటూ, ఖమ్మం లో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. సినిమా హీరో ప్రచారానికి రావడంతో ఆయనను చూసేందుకు ప్రజలు కూడా బాగా వస్తున్నారు. ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు తారల ప్రచారం బాగానే కలిసి వస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు ఫలితాలనిస్తుందనేది మరో రెండు వారాలలో తెలిసిపోతుంది.