డిసెంబర్ 7న అరడజను సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. అందరి కంటే ముందు ఏడో తేదీ మీద ‘శుభలేఖలు’ అనే చిన్న సినిమా కర్చీఫ్ వేసింది. తరవాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘కవచం’, అంతా కొత్తవాళ్ళతో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘హుషారు’ వచ్చాయి. సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’, సందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాలు వారం క్రితం అనూహ్యంగా డిసెంబర్ 7వ తేదీ రేసులోకి వచ్చాయి. “పెద్ద దర్శకుడు చిన్న పిల్లల కోసం తీసిన సినిమా ‘2.ఓ’ అయితే… చిన్న దర్శకుడు పెద్దల కోసం తీసిన ‘భైరవగీత” అంటూ పబ్లిసిటీ కోసం పలు ట్వీట్లు చేసిన వర్మ, సెన్సార్ సమస్యల వల్ల తను నిర్మించిన ‘భైరవగీత’ను డిసెంబర్ 7కి వాయిదా వేశారు. మొత్తం మీద డిసెంబర్ 7వ తేదీన అటుఇటుగా 7 సినిమాలు విడుదలవుతున్నాయి. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… గురువారం (మరికొన్ని గంటల్లో) రజనీకాంత్ ‘2.ఓ’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘2.ఓ’ వచ్చిన ఏడెనిమిది రోజులకు పైన చెప్పుకున్న సినిమాలన్నీ వస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన రెండు మూడు వారాల వరకూ మీడియం రేంజ్ సినిమాలను విడుదల చేయరు. ఏవో చిన్నా చితకా సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ, డిసెంబర్ 7న విడుదలకు సిద్ధమైన ‘కవచం’, ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాలు కాస్త బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలే. కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు వున్నారు. మిగతా సినిమాలూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరూ డిసెంబర్ 7న వస్తామని గట్టిగా చెబుతున్నారంటే… ‘2.ఓ’ ఫ్లాపవుతుందని గట్టి నమ్మకమా? ఒకవేళ హిట్టయితే తమ సినిమాను వాయిదా వేద్దామనే ఆలోచనా? వెయిట్ అండ్ సీ!!