రోబో 2.ఓకి పోటీగా తమ సినిమా విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసేశాడు రాంగోపాల్ వర్మ. రజనీని చూసి మిగిలిన సినిమాలన్నీ భయపడుతున్న వేళ.. `భైరవగీత`ని పోటీగా దింపి ఆశ్చర్యపరిచాడు. `రోబో 2 చిన్న పిల్లల సినిమా – మాది పెద్దల సినిమా` అంటూ… రోబోని తక్కువ చేసి మాట్లాడాడు వర్మ. తీరా చూస్తే… ఇప్పుడు `భైరవగీత` వాయిదా పడింది. సెన్సార్ సమస్యల వల్ల ఈ సినిమాని వారం రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నామని వర్మ ప్రకటించాడు.
నిజానికి హైదరాబాద్‌లో ఈ సినిమా సెన్సార్ జరగాల్సింది. ఇప్పటి వరకూ సెన్సార్‌కి అప్లయ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు సెన్సార్ సమస్యలు అనడంలో అర్థం ఏముంది? ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. సెన్సార్ ని బెంగళూరులో చేయించాలన్నది నిర్మాతల ప్రయత్నం. అక్కడే అప్లయ్ చేశారు. కానీ బెంగళూరు సెన్సార్ బోర్డు.. `తెలుగు వెర్షన్‌ని హైదరాబాద్‌లోనే సెన్సార్ చేసుకోండి` అని చెప్పార్ట. దాంతో… తెలుగు సెన్సార్ జరగలేదు. అలా ఈ సినిమా ఆగిపోయింది. తెలుగులో సెన్సార్ బోర్డు ఉండగా.. ఈ కాపీని బెంగళూరుకి పంపడం ఎందుకనేదే అర్థం కావడం లేదు. రోబో 2.ఓ ప్రచారం, ఆ సినిమా కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. ఆ ఫీవర్ గంట గంటకూ పెరుగుతోంది. ఈ సమయంలో మరే సినిమా వచ్చినా.. చితికిపోవడం ఖాయం. అందుకే… వర్మ వెనకడుగు వేశాడేమో. రోబో కి పోటీగా తమ సినిమాని దింపాలని గట్టిగా అనుకుంటే.. సెన్సార్ సమస్యలు తలెత్తకుండా ముందే జాగ్రత్త తీసుకునేవారు కదా..!